వీరి ఓటు విలువ ఇంతింత కాదయా!

8 Jun, 2019 14:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చు 1998 నాటి నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింటుందని ‘సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌’ అనే స్వతంత్య్ర పరిశోధనా సంస్థ అంచనా వేసింది. 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎన్నికల కమిషన్‌ ముందుగానే అంచనా వేసింది. ఈ మొత్తాన్ని విభజిస్తే ఒక్కో నియోజక వర్గానికి వంద కోట్ల రూపాయలు, ఒక్క ఓటుకు 700 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క. 

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్నిబట్టి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు, ప్రతి అసెంబ్లీ 20 నుంచి 28 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అర్హుడు. ఈసారి లోక్‌సభకు 8, 049 అభ్యర్థులు, అసెంబ్లీలకు 3,589 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరంతా కలిసి అధికారికంగా 6,639.22 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి పరిమితికి మించే ఖర్చు చేస్తారని, పరిమితంగానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు చూపిస్తారని అందరికి తెల్సిందే. అందుకనే మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ఓ సందర్భంలో ‘కొందరి లోక్‌సభ జీవితం పెద్ద అబద్ధంతోనే ప్రారంభమవుతోంది’ అని చమత్కరించారు. ఈసారి అభ్యర్థులందరూ కలిసి 24వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ‘సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌’ అంచనా వేసింది. 

రాజకీయ పార్టీలు మరో 18 వేల కోట్లు, ఎన్నికల కమిషన్‌ లేదా ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు, మీడియా–దాతలు మూడు రెండు కోట్లు, రాజకీయేతరులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. దీనికి అదనంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ వర్గాలు మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, నగదు రూపేనా అక్రమంగా రవాణా అవుతున్న రూ. 3, 475 కోట్లను పట్టుకున్నారు. 2014 ఎన్నికలకన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. ఈ మొత్తంలో పాలకపక్ష బీజేపీ 45 నుంచి 50 శాతం అంటే 24 వేల కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగా, కాంగ్రెస్‌ పార్టీ 15 నుంచి 20 శాతం వరకు డబ్బు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడానికి కారణం అంతగా డబ్బులు అందుబాటులో లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకే అధిక నిధులు వచ్చిన విషయం తెల్సిందే. 

మరిన్ని వార్తలు