ఢిల్లీలో మోదీ భారీ బహిరంగ సభ

22 Dec, 2019 13:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ శ్రేణుల అంచనా. ఉగ్రవాదుల నుంచి ప్రధానికి ముప్పు ఉన్న  నేపథ్యంలో ఎన్‌ఎస్‌జీతో పాటు దాదాపు 5వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ అమూల్య పట్నాయక్‌ శనివారం భద్రత ఏర్పాట్ల గురించి పలు భేటీలు నిర్వహించారు. ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లతో పాటు సమీప భవనాల మీద స్నిప్పర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.


 
ఢిల్లీలో ఈ సారి పక్కా?
ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పాగా వేయడానికి గట్టి కృషి  చేస్తున్నామంటూ ఢిల్లీ బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ గోయోల్‌ శనివారం వెల్లడించారు. ఇదికాక, ఢిల్లీలోని అనధికార కాలనీలలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులను కల్పిస్తూ ఈ నెల 4వ తేదీన పార్లమెంటులో బిల్లు పాసైంది. దీంతో 1731 కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 40 లక్షల మంది ఓటర్లు మోదీ పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. మోదీకి కృతజ్ఞతగా 11 లక్షల మంది సంతకాలతో కూడిన ప్రతిని ఈ సభలో ఆయనకు బహుకరిస్తున్నారు. అంతేకాక, మోదీ ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో నిర్వహిస్తున్న మొదటి ఎన్నికల సభ ఇది. సభ నేపథ్యంలో ఢిల్లీ - గుర్‌గావ్‌ రహదారిపై ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మరోవైపు ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరకంగా పలు నిరసన ప్రదర్శనలు జరుగుతుండడంతో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకొంది. చదవండిఅభివృద్ధిపై దృష్టి పెట్టండి

మరిన్ని వార్తలు