బ్యాలెట్‌ ఓట్లలో గోప్యతేది?

23 Apr, 2019 10:22 IST|Sakshi

ఓటు వేసేందుకు జంకుతున్న ఉద్యోగులు

 కాసిపేట(బెల్లంపల్లి) : రాజ్యాంగం పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో వివాదాలకు తావివ్వకుండా రహస్యంగా ఓటు హక్కును వినియోగించే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అదే తరహాలో సౌకర్యాలు కల్పించి శాంతియుతంగా ఓటు హక్కుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన బ్యాలెట్‌ ఓటులో మాత్రం గోప్యత కరువైందని ఉద్యోగులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంకుతున్నారు.

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ముందస్తుగా వారికి కేటాయించిన ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. గ్రామాలలో నలుగురైదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అందులో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఈ క్రమంలో బ్యాలెట్‌ ఓట్లపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటుకు దూరంగా ఉంటున్నారు. ముందస్తుగా వేసిన ఓటుకు సంబంధించి కనీసం బ్యాలెట్‌పై స్వస్తిక్‌ ముద్ర వేయాల్సి ఉండగా అది అందుబాటులో ఉంచడం లేదు.

దీంతో సంబంధిత బ్యాలెట్‌పై నచ్చిన అభ్యర్థికి పెన్నుతో టిక్‌ మార్కు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఓట్లు కౌంటింగ్‌ చేసేటప్పుడు ఒకటి, రెండు ఓట్లు కావడంతో ఎవరికి వేశారని అభ్యర్థులు విచారించుకునే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆర్వోలు వచ్చిన రెండు, మూడు ఓట్లను వ్యాలెట్‌ ఓట్లు అంటూ అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తున్నారని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మినహా సర్పంచ్, ఎంపీటీసీ , వార్డు ఎన్నికల్లో తక్కువ మంది బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునే ఉద్యోగ ఓటర్లు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఉద్యోగులకు బ్యాలెట్‌ ఓట్లలో గోప్యత లేకుండా పోయిందని గతంలో అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్దేశించే సమయంలో మాత్రమే బ్యాలెట్‌ ఓట్లు లెక్కించే వారని ప్రస్తుతం ప్రమాదకరంగా పరిస్థితులు మారాయని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని కార్యాలయాల్లో స్వస్తిక్‌ మార్కు ముద్ర పెట్టడంతోపాటు ఓట్లను అభ్యర్థులకు మొదట చూపకుండా పూర్తి స్థాయి ఓట్లలో కలిపితేనే ఓటుకు విలువ ఉంటుంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్వస్తిక్‌ మార్కు అందుబాటులో ఉంచాలని లేదంటే చాలా గ్రామాల్లో ఉద్యోగులు ఓటుకు దూరంగా ఉండే పరిస్థితులు నెలకొంటాయని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు