మోదీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు

4 May, 2020 14:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీలపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీలపై బాధ్యతగల ప్రభుత్వం వ్యవహరించే విధానం ఇదేనా అని నిలదీశారు. ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంలాంటి కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాక్‌డౌక్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులను స్వస్థలాలకు పంపడంతో మోదీ సర్కార్‌ విఫలమైందంటూ మండిపడ్డారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ సోమవారం వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. (వలస కార్మికుల ఖర్చులు భరిస్తాం)

‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటకు వస్తే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమానికి ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న వేలాది మందిని రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకువచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా సంక్షోభం నుంచి కాపాడేందుకు భారతీయ రైల్వే కేంద్ర ప్రభుత్వానికి రూ. 151 కోట్లు విరాళంగా ప్రకటించింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. కానీ దేశ నిర్మాణంగా కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆదుకునేందుకు మాత్రం కేంద్రం ముందుకు రాకపోవడం దారుణమైన విషయం. కనీసం వారి ప్రయాణ ఛార్జీలను సైతం చెల్లించకపోవడం సరైన విధానం కాదు. వలస జీవుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి  ఏంటో ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోంది’ అంటూ వరుస ట్వీట్లతో సోషల్‌ మీడియా వేదికగా మోదీ సర్కార్‌పై ప్రియాంక విమర్శల వర్షం కురిపించారు.

కాగా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. వలసకార్మికుల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని,  రైళ్ల ఖర్చులు కూడా పార్టీ భరిస్తుందని పార్టీ అధినేత్రి సోనియా తెలిపారు. స్థానిక పార్టీ నేతలు వలస కార్మికులకు భరోసా నివ్వాలని సోనియా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు కార్మికుల కష్టాలపై కేంద్రానికి సోమవారం ఆమె లేఖ రాశారు. (మోదీకి సోనియా గాంధీ లేఖ)

>
మరిన్ని వార్తలు