‘ప్రియాంక’ గంగాయాత్ర

19 Mar, 2019 03:14 IST|Sakshi
త్రివేణిసంగమం వద్ద పూజలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ

మనయ్య ఘాట్‌ నుంచి ప్రారంభం

అలహాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని తిరిగి తెచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నడుం బిగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సోమవారం ‘గంగా యాత్ర’ ప్రారంభించారు. ‘మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా సోదరుడు ఏం చెబుతాడో.. అదే చేసి చూపిస్తాడు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ప్రయాగరాజ్‌ జిల్లాలోని కఛ్‌నర్‌ తెహ్‌సీల్‌లో ఉన్న మనయ్య ఘాట్‌ నుంచి గంగానదిలో మోటారు బోటులో ప్రయాణం ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. అలహాబాద్‌ నుంచి వారణాసి వరకు గంగా నదిలో బోటు ద్వారా 100 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణిస్తారు. బోటు ప్రయాణం ప్రారంభించడానికి ముందు సంగం వద్ద ఉన్న బడే హనుమాన్‌ మందిర్‌లో పూజలు నిర్వహించారు. ప్రసంగాలు ఇవ్వడం కంటే ప్రజల కష్టాలు, సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలు గాంధీ కుటుంబానికి పిక్నిక్‌ లాంటిదని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘వారు వస్తారు. బస చేస్తారు. పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇస్తారు. ఎన్నికలు అయిపోగానే ఏ స్విట్జర్లాండ్‌కో, ఇటలీకో వెళ్తారు’అని ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ విమర్శించారు.

‘పప్పు కీ పప్పీ వచ్చారు’
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను ‘పప్పు’అని, ఆయన సోదరి ప్రియాంకను ‘పప్పీ’ అని కేంద్రమంత్రి మహేశ్‌ శర్మ ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని కావాలని పప్పు అంటుంటారు. ఇప్పుడు కొత్తగా ‘పప్పు కీ పప్పీ’ వచ్చారు’’అని శర్మ అన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ‘ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో.. మాటలూ అలాగే ఉన్నాయి. కేంద్రమంత్రి స్థానంలో ఉండి ఓ మహిళ పట్ల అలా ఎలా మాట్లాడతారు’ అని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ధీరజ్‌ గుర్జర్‌ మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా