వారణాసిని పట్టించుకోరు

30 Mar, 2019 05:16 IST|Sakshi
అయోధ్యలో మహిళలతో ముచ్చటిస్తున్న ప్రియాంక గాంధీ

ప్రధాని మోదీని విమర్శించిన ప్రియాంక

అయోధ్య: ప్రధానిపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ విదేశాలు నిర్విరామంగా తిరుగుతున్న మోదీ సొంత నియోజకవర్గం వారణాసిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీంతో వారణాసిలో ఆమె బరిలోకి దిగుతారని వినిపిస్తున్న ఊహాగాలను మరింత బలం చేకూరినట్లయింది. శుక్రవారం అయోధ్యలో ఓ వీధిలో ప్రజలతో ముచ్చటిస్తూ ప్రియాంక.. బీజేపీ ప్రభుత్వం ధనికులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతులు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన అభివృద్ధి గురించి అడిగితే విమానాశ్రయం నుంచి పట్టణానికి నిర్మించిన రోడ్డు గురించి చెప్పారని అన్నారు. గత యూపీయే ప్రభుత్వం మంజూరు చేసిన 150 కి.మీలో కేవలం 15 కి.మీ రోడ్డు వేశారని, విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగే ఆ దారి నిండా గుంతలున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో మోదీ తన నియోజకవర్గంలోని గ్రామంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని గుర్తుచేశారు. యూపీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

>
మరిన్ని వార్తలు