కాంగ్రెస్‌-జేడీఎస్‌ వెనుక ప్రియాంక గాంధీ

16 May, 2018 13:03 IST|Sakshi
ప్రియాంక గాంధీ వాద్రా (పాత ఫొటో)

సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో భారతీయ జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ), జనతా దళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌)లు చేతులు కలపడం వెనుక ప్రియాంక గాంధీ వాద్రా హస్తం ఉన్నట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేయాలని ప్రియాంక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చెప్పారనేది సదరు రిపోర్టు సారాంశం.

కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్‌తో జట్టు కట్టేందుకు రాహుల్‌ ససేమీరా అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జేడీఎస్‌ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గులాం నబీ ఆజాద్‌ దేవే గౌడ, కుమారస్వామిలకు కాంగ్రెస్‌ ఆఫర్‌ను చెప్పి, ఒప్పించడంలో విజయం సాధించారు.

ముఖ్యమంత్రిగా కుమారస్వామి అభ్యర్థిత్వాన్ని బలపర్చుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా కన్నడనాట రాజకీయాలు వేడెక్కాయి. అయితే, 2019లో కూడా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులకు సై అంటే పార్టీలన్నీ ప్రధానమంత్రిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం సోనియా గాంధీ తిరిగి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని రిపోర్టులో ఉంది.

మరిన్ని వార్తలు