వాట్సప్‌ డేటా చోరీపై ప్రియాంక ఫైర్‌

1 Nov, 2019 12:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సాప్‌ చేసిన ప్రకటన భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దీనిని కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపిస్తు కాంగ్రెస్‌​ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారిని ఇబ్బందులు పెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. భారత పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీచేయడమంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లేనని మండిపడ్డారు. ఇలాంటి ఘటనతో దేశ భద్రతకు ఎంతో ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందిచాలని ప్రియాంక ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్‌ తెలిపిన విషయం తెలిసిందే. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సప్‌ కేసు వేసింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా