యూపీలో నేరగాళ్ల ఇష్టారాజ్యం

30 Jun, 2019 04:30 IST|Sakshi

ప్రియాంకా గాంధీ ఆరోపణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న పోలీసుల నివేదికను తప్పుపట్టిన ఆమె.. యూపీలో నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర గణాంకాలను తారుమారు చేసిన పోలీసులు నేరాల సంఖ్య తగ్గిందంటూ చెబుతున్నారని అఖిలేశ్‌ విమర్శించారు. శనివారం ప్రియాంక ట్విట్టర్‌లో..ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. నేర ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నేరగాళ్లకు సర్కారు లొంగిపోయిందా?’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలో నేరాలపై పలు నివేదికలను జత చేశారు. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ స్పందించారు. ‘మా ప్రభుత్వం నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసింది. నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలు తగ్గాయి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు