ఇట్లు.. ‘ప్రియ’మైన!

18 Mar, 2019 08:19 IST|Sakshi

కటౌట్‌

అందరి ముందు చనువుగా తల్లి సోనియా బుగ్గ గిల్లగలరు. కూతురు బాస్కెట్‌బాల్‌ ఆడుతుంటే ఒక ప్రేక్షకురాలిగా గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టగలరు. ఆప్యాయంగా అన్న రాహుల్‌ భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించగలరు. మురికివాడల ప్రజలతో కూడా మమేకమై తనని తాను మరచిపోగలరు. రాజకీయాల్లో  ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్నా, అచ్చుగుద్దినట్టు నానమ్మ ఇందిరను తలపించినా, ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ ‘మేడం రావాలం’టూ కార్యకర్తలు గళమెత్తుతున్నా ఇన్నాళ్లూ ఆమె తెరవెనుక వ్యూహ రచనకే ప్రాధాన్యతనిచ్చారు. తల్లి, సోదరుడు నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథీలో ప్రచారానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో  కార్యకర్తలు కన్న కలలు నెరవేరేలా కాంగ్రెస్‌ పార్టీ తన తురుపు ముక్కని ప్రధానమంత్రి మోదీపై ప్రయోగిస్తోంది. అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ప్రాంత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్‌లో ‘ప్రియాంకం’ మొదలైంది.

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక 1972, జనవరి 12న ఢిల్లీలో పుట్టారు.
ఢిల్లీ యూనివర్సిటీలో జీసస్‌ మేరీ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేశారు.
పెళ్లయ్యాక ప్రియాంక బౌద్ధమతం స్వీకరించారు. ప్రతీరోజూధ్యానసాధన చేస్తారు.
ఫొటోగ్రఫీ అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఎక్కడికెళ్లినా చేతిలో కెమెరా ఉండాల్సిందే.
ఎన్నికలు ముంచుకొస్తూ ఉండటంతో తూర్పు యూపీలో క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలంగా లేని పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దే బాధ్యత ప్రియాంకకి సవాల్‌గా మారింది.
16 ఏళ్ల వయసులోనే తొలిసారి రాజకీయ ప్రసంగం చేసి, ఎన్నో ర్యాలీలు, సదస్సుల్లో పాల్గొన్నారు.
ప్రియాంక తన రాజకీయ దార్శనికతకు అక్షరరూపం ఇవ్వనున్నారు. ఎగైనెస్ట్‌ ఔట్‌రేజ్‌ (దౌర్జన్యానికి వ్యతిరేకంగా) అన్న టైటిల్‌తో ఒక పుస్తకం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
తన క్లాస్‌మేట్‌ మిషెల్‌ అన్న, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాతో టీనేజ్‌లోనే ప్రేమలో పడ్డారు. 1997లో పెళ్లి చేసుకున్నారు. వారికి రెహాన్‌ అనే కుమారుడు, మిరాయా అనే కుమార్తె ఉన్నారు.
యూపీలో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్‌ నెగ్గేలా వ్యూహాలు పన్నే బాధ్యత ప్రియాంకదే.
ఇప్పటివరకూ మరే నాయకుడు చేయలేని పని ప్రియాంక చెయ్యబోతున్నారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వారణాసి వరకు గంగానదిపై పడవలో ప్రయాణిస్తూ నదీ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఆ గ్రామాల్లో వెనుకబడిన కులాలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో ఇతర పక్షాల్లో గుబులు మొదలైంది.
ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రచారం బాధ్యతలను భుజస్కంధాలకు ఎత్తుకున్నారు.
భర్త రాబర్ట్‌ వాద్రాపై ఉన్న అవినీతి కేసులే ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ప్రియాంక ఎదుర్కోవాల్సిన అత్యంత సంక్లిష్టమైన అంశం.

మరిన్ని వార్తలు