ప్రియాంక రాజకీయ అరంగేట్రం

24 Jan, 2019 03:53 IST|Sakshi
ప్రియాంక గాంధీ వాద్రా, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తల సంబరాలు

తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

కార్యకర్తల మనోధైర్యం పెంచేందుకు కాంగ్రెస్‌ కీలక నిర్ణయం

జ్యోతిరాదిత్య సింధియాకు పశ్చిమ యూపీ బాధ్యతలు

ప్రియాంక ఆగమనం రాహుల్‌ వైఫల్యానికి నిదర్శనం: బీజేపీ

న్యూఢిల్లీ: చాలా ఏళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు అధికారికంగా రాజకీయ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(47) బుధవారం తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో ఆమె తన సోదరుడు రాహుల్‌కు సహాయకారిగా పనిచేస్తారని వెల్లడించాయి.

కాంగ్రెస్‌ను విస్మరించి ఎస్పీ–బీఎస్పీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తల మనోధైర్యం పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1980 మధ్యనాళ్ల వరకు ఉత్తరప్రదేశ్‌ను తన కంచుకోటగా నిలుపుకున్న కాంగ్రెస్‌ క్రమంగా ప్రభ కోల్పోయింది. ప్రియాంక నియామకంతో అక్కడ పునర్‌వైభవం సంతరించుకుంటామని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి.

అలాగే,  ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్‌ గాంధీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. హరియాణా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గులాం నబీ ఆజాద్‌ స్థానాన్ని ప్రియాంక, సింధియా భర్తీ చేయనున్నారు. ప్రియాంక నియామకం పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్‌ పేర్కొనగా, బీజేపీ పెదవి విరిచింది. రాహుల్‌ నాయకత్వ వైఫల్యాన్ని ఆమె నియామకం సూచిస్తోందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ ఓటమిని ప్రియాంక గాంధీ కూడా తప్పించలేరని పేర్కొంది.

యూపీలో సానుకూల మార్పు:రాహుల్‌
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడం ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామంగా మారింది. ప్రియాంక గాంధీ నియామక ప్రకటన వెలువడగానే రాహుల్‌ గాంధీ అమెథీలో మీడియాతో మాట్లాడుతూ తన సోదరిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియాంక సమర్థురాలని, ఎన్నికల సమయంలో ఆమె తనకు అండగా ఉండబోతుండటం హర్షదాయకం అని పేర్కొన్నారు. ఆమె రాకతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త ఆలోచనలు, సానుకూల మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కూటమిగా ఏర్పడిన ఎస్పీ–బీఎస్పీలపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, బీజేపీని ఓడించేందుకు వారితో కలసిపనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గుజరాత్‌ అయినా యూపీ అయినా ఎన్నికల్లో దూకుడుగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అంతర్గత పునర్వవ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఇటీవల రాజస్తాన్‌ సీఎంగా ఎన్నికైన అశోక్‌ గహ్లోత్‌ స్థానంలో కేసీ వేణుగోపాల్‌ను ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌)గా నియమిం చింది. ఆయన కర్ణాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగనున్నారు.

ఇప్పటికే కీలక నిర్ణయాల్లో పాత్ర..
మాజీ ప్రధాని, నానమ్మ ఇందిరా గాంధీ పోలికల్లో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారని కాంగ్రెస్‌ నేతలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.ప్రియాంక ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తారని సోనియా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ తరఫున అడపాదడపా ప్రచారం చేసిన ఆమె.. పార్టీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో పాత్ర పోషించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ సీఎంల ఎంపికలో రాహుల్‌కు సలహాలిచ్చారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌లోకి మాజీ క్రికెటర్‌ సిద్ధూ, మన్‌ప్రీత్‌ బాదల్‌ను తీసుకురావడంలోచొరవ చూపారు.‘ప్రియాంక.. శుభాకాంక్షలు. జీవితంలో ఏ దశలోనైనా నీకు తోడుగా ఉంటా. నీ శక్తిమేర పనిచేసి ఉత్తమ ఫలితాలు రాబట్టు’ అని భర్త రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. భారత రాజకీయాల్లో ఎక్కువ సమయం వేచి చూసింది ప్రియాంక రాక కోసమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు