మహాకూటమితో మహాముప్పు

5 Nov, 2018 01:59 IST|Sakshi

 ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కేసీఆర్‌ ప్రభుత్వంలోనే భరోసా

కాలేజీ యాజమాన్యాల సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు కేసీఆర్‌ ప్రభుత్వంలోనే భరోసా ఉంటుందని శాసనమండలి చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో నాణ్య తా ప్రమాణాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ప్రైవేటు విద్యాసంస్థను కూడా ప్రభుత్వం మూసివేయలేదన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో విద్యార్థుల్లేక కొన్ని మూతపడ్డాయి తప్ప మరేమీ కాదన్నారు. రాష్ట్రంలో కేఎల్‌ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కొంతమంది చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలేనన్నారు. అసలు ఆ విద్యా సంస్థలు టీడీపీ నేతలు, మంత్రులకు సంబంధించినవేనన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలోనే నారాయణ, శ్రీచైతన్యకు చెందిన 60 బ్రాంచీలు మూతపడ్డాయని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలం కాదన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకే ప్రయోజనం ఉంటుందన్నారు.  

‘జేఏసీ’ది తప్పుడు ప్రచారం
కొంతమంది యాజమాన్య సంఘాల నేతలు కేజీ టు పీజీ జేఏసీ పేరుతో మహాకూటమి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో చెల్లించాల్సిన రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో అధికారు లు సీఎంను తప్పుదోవ పట్టించారని, ఆ తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే 1,800 కోట్లు చెల్లించిందన్నారు. అలాంటి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు.  కూటమి నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధా్దలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.17 వేల వేతనం ఉంటే ప్రభుత్వం రూ.37 వేలకు పెంచిందన్నారు.  ఈ సమావేశంలో యాజమాన్య సంఘాల నేతలు ప్రకాశ్, నాగయ్య, పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు