ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి

8 Sep, 2019 03:20 IST|Sakshi
లక్ష్మణ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు

వివాదాస్పద చిత్రాలపై విపక్ష పార్టీలు, హిందూ సంస్థల నిరసన  

సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ ప్రాకార మండపాల్లో సీఎం కేసీఆర్, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల చిత్రాలను చెక్కడాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు శనివారం ఇక్కడ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పార్టీలు, ధార్మిక సంస్థలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదాలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, విశ్వహిందూ పరిషత్‌ సంస్థ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. ఉదయం ఆలయాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజాసింగ్‌ 10 మంది కార్యకర్తలతో వెళ్లి ఆలయా న్ని పరిశీలించారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి భారీ ర్యాలీతో కొండపైకి వెళ్లెందుకు యత్నించగా ఆయనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ముఖ్యమైన నేతలను పంపిం చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పార్టీ కార్యకర్తలతో రావడంతో పోలీసులు పరిమి త సంఖ్యలో కొండపైకి అనుమతినిచ్చారు.

మధ్యాహ్నం సమయంలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు కొండపైకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలను అరెస్టుచేసి అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కార్యకర్తలతో వచ్చారు. దీంతో పోలీసులు వారి కాన్వాయ్‌ను నిలిపివేశారు. అప్పటికే పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. సహనం కోల్పోయిన పోలీసులు.. బీజేపీ నేతలను అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించారు. కోపోద్రికులైన బీజేపీ నేతలు భారీకేడ్లు నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అనంతరం పోలీసులు వారిని కొండపైకి పంపారు. లక్ష్మణ్‌తోపాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా కొండపై శిల్పాలను పరిశీలించారు. పార్టీల ఆందో ళన నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

>
మరిన్ని వార్తలు