విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్‌!

23 Apr, 2019 16:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్‌ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో!
ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో గందరగోళానికి  గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్‌ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది.

ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్‌ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం.

ఇంటర్‌ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన
ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్‌ఎస్‌ నేతను బయటకు తీసుకొచ్చారు.

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన
ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్  చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు  చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్‌ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్  చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి.

మరిన్ని వార్తలు