సభకు కర్ణాటక సెగ

10 Jul, 2019 03:51 IST|Sakshi
‘కర్ణాటక’పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ సభ్యులు

పార్లమెంట్‌ ఉభయసభల్లో కాంగ్రెస్‌ ఆందోళనలు

ఎమ్మెల్యేలను ‘వేటాడటాన్ని’ బీజేపీ ఆపాలంటూ నినాదాలు

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల సూచనల మేరకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ పార్లమెంటులో ఈ అంశంపై మంగళవారం కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడం, వివిధ ఇతర అంశాలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ మంగళవారం పూర్తిగా వాయిదా పడింది.

ఉదయం రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు, నినాదాలు చేశారు. దీంతో సభను వెంకయ్య వాయిదా వేసి, మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ కార్యకలాపాలను చేపట్టారు. ఆ సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించినప్పటికీ, సభ్యులు సభ మొదలవగానే వెల్‌లోకి వచ్చి నిరసనలకు దిగారు.

దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు హరివంశ్‌ ప్రకటించారు. 2 గంటలకు సమావేశమైనప్పుడు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, మంగళవారం ఉదయం సభా కార్యకలాపాలను ప్రారంభించిన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ముందే నిర్ణయించిన, సభలో ప్రస్తుతం చర్చించాల్సిన విషయాలను పక్కనబెట్టి కర్ణాటక అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ నుంచి తనకు నోటీసు అందిందనీ, కానీ దీనికి ఒప్పుకోవడం లేదని తెలిపారు.

లోక్‌సభలో నినాదాలు చేసిన రాహుల్‌
కర్ణాటక అంశంపై లోక్‌సభలోనూ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలను ‘వేటాడే’ చర్యలను బీజేపీ ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ మాట్లాడుతూ కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలోనూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు.

చౌధరి మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ సభలోకి వచ్చారు. ‘నియంతృత్వం నశించాలి. వేటాడే రాజకీయాలను ఆపేయాలి’ అని నినాదాలు చేశారు. ఈడీ, సీబీఐల చేత కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేత బీజేపీయే రాజీనామాలు చేయిస్తోందని బీకే హరివంశ్‌ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో తమ పాత్ర లేదని బీజేపీ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా