జెండాలు దించేసిన జాతీయ పార్టీలు

28 May, 2019 13:36 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ ప్రభంజనంతో జిల్లాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు జెండాలు దించేశాయి. మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్న టీడీపీ నెల్లూరు సిటీ మినహా మరే నియోజవకర్గంలో కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. జాతీయ పార్టీలైతే కనీస డిపాజిట్లు కూడా రాని దుస్థితి నెలకొంది. ఆయా పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.  

సాక్షి, నెల్లూరు: రాజకీయాలకు రాజధానిగా పేరున్న నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేది. జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉండడంతో ప్రతిసారి ఎన్నికల్లో ఆ పార్టీ సత్తాచాటేది. రాజకీయ ఉద్ధండులుగా పేరున్న బెజవాడ, నేదురుమల్లి, ఆనం కుటుంబాలు జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారు. దీంతో జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా కంచుకోటగా ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభతో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీగా చెలామణి అయింది. వైఎస్సార్‌ పాలనతో ప్రజలు, పార్టీ శ్రేణులు ఆ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. వైఎస్సార్‌ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్ర విభజనాంతరం మారిన రాజకీయ పరిస్థితులు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసింది. ఆ పార్టీ శ్రేణులంతా దివంగత వైఎస్సార్‌ తనయుడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచారు. వైఎస్సార్‌ జిల్లా తర్వాత వైఎస్సార్‌సీపీకి నెల్లూరు జిల్లానే అండగా నిలిచిందని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లోనై కాంగ్రెస్‌కు కొంత బలమైన అభ్యర్థులు దొరికారేమో కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పది నియోజకవర్గాలకు అనామకులను నిలబెట్టడంతో అభ్యర్థులకు నోట ఓట్లకంటే అతి తక్కువ రావడం విశేషం.

నామమాత్రం పోటీ ఇవ్వని కమలం
దేశంలో బలమైన పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కనీస నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. బీజేపీ అగ్రనేతగా జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలిగిన వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ పార్టీ ఎదుగుదలకు మాత్రం ఆయన ప్రభ దోహద పడలేదు. గతంలో బీజేపీకి మంచి క్యాడర్‌ ఉన్న ఆ పార్టీకి అగ్రనేతల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో పార్టీ కేడర్‌కు  ఇబ్బందిగా మారింది. ఎక్కువ సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. దీనికి తోడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా  పని చేసిన వెంకయ్యనాయుడు కూడా జిల్లాలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేసిన దాఖలాలు కూడా లేవు. జిల్లా పార్టీలో వర్గ రాజకీయాను అగ్రనేతలు ప్రోత్సహించడం మైనస్‌గా మారింది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినా నామమాత్రంగా పోటీగానే మిగిలింది.

వామపక్షాల తీరు అదే
వామపక్ష పార్టీలకు గతంలో బలమైన క్యాడర్‌ ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ దఫా ఎన్నికల్లో మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీకి దూరంగా ఉండిపోయాయి. కేవలం నెల్లూరు పార్లమెంట్‌ బరిలో మాత్రం జనసేన పొత్తుతో సీపీఎం బరిలో ఉన్నా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. గతంలో సీపీఎం నుంచి శాసన సభకు ఎన్నికైన చరిత్ర ఉంది. కానీ మారిన రాజకీయ పరిణామాల దృష్ణా  ప్రాంతీయ పార్టీల పొత్తులతో ఆ పార్టీ కూడా సార్వత్రిక ఎన్నికల పోటీలో నామమాత్రంగా నిలిచింది. నెల్లూరు పార్లమెంట్‌కు సీపీఎం తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 18,830 ఓట్లు వచ్చాయి. ఇదే నియోజకవర్గంలో నోటాకు 17,161 ఓట్లు వచ్చాయి.  ఒంటరి పోరాటంలో ఉనికిని చాటుకున్న వామపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీల పొత్తుతో నోటా కంటే దయనీయంగా మారాయి.

పగిలిపోయిన గ్లాసు
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆదరణ కరువైంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సోదరుడు చిరంజీవి స్థాపించిన çప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతం కంటే చాలా తక్కువ శాతం మాత్రమే జనసేకు వచ్చాయి. ప్రజారాజ్యం తరఫున నెల్లూరుసిటీ నియోజకవర్గం పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ జనసేన మాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

మరిన్ని వార్తలు