యువ సారథులు

8 Jun, 2019 12:23 IST|Sakshi

ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు అమాత్య పదవులు

ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌లకు దక్కిన బెర్త్‌లు

రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో చోటు

జిల్లాలో యువశకం మొదలైంది. ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు అమాత్యయోగం దక్కింది. పార్టీకి ఆవిర్భావం నుంచి  విధేయంగా ఉంటూ రెండో సారి గెలుపొందిన ఈ ఇద్దరికీ సామాజిక సమీకరణలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆత్మకూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల నుంచి వరుసగా రెండో సారి గెలుపొందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌లకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో బెర్త్‌లు దక్కాయి. రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం శనివారం అమరావతిలో జరగనున్న క్రమంలో జిల్లా నుంచి ఇద్దరు యువ ఎమ్మెల్యేలను ఎంపిక చేశారు. ఈ మేరకు  ఎమ్మెల్యేలకు అధికారిక సమాచారం అందింది. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని పిలుపు వచ్చింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి గడ్డపై మరో చరిత్ర లిఖితమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ.. మంత్రి వర్గ కూర్పులో యువ శకానికి చోటు దక్కడం మరో చరిత్ర. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కింది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం అనంతరం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే నడిచిన నేతలకు పట్టం కట్టారు. సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేస్తూ రూపుదిద్దుకున్న కేబినెట్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జిల్లా నుంచి మంత్రులుగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా యువకులు కావడం విశేషం. జిల్లాలో మేకపాటి కుటుంబ రాజకీయ వారసుడిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్టీకి పూర్తి విధేయంగా ఉంటూ అధినేత అడుగు జాడల్లో నడిచారు. ఈ క్రమంలో కేబినెట్‌లో బెర్త్‌ దక్కింది. నెల్లూరు నగరం నుంచి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు. రెండో పర్యాయం టీడీపీలో మంత్రిగా ఉన్న పి.నారాయణపై గెలుపొందడం సంచలనంగా మారింది. దీంతో పాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విధేయుడుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనిల్‌కుమార్‌యాదవ్‌కు మంత్రి వర్గంలో స్థానం లభించింది. జిల్లా రాజకీయ చరిత్రలో మొదటి బీసీ మంత్రిగా అనిల్‌కుమార్‌యాదవ్‌ చరిత్ర లిఖించారు. పిన్న వయస్సులో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు కావడంపై జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నవ శక చరిత్ర
జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. నవశకానికి నాంది పలికారు. రాజకీయ ఉద్దండులు, ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను అందించిన జిల్లాలో సహజంగా తలపండిన నేతలే ఇప్పటి వరకు మంత్రులు అవుతూ వచ్చారు. ఇలాంటి చరిత్రకు భిన్నంగా నవ శక చరిత్ర లిఖించారు. జిల్లాలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం నమోదు చేసింది. జిల్లాలో పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో పది స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలకు రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించి జిల్లా రాజకీయ చరిత్రలో వైఎస్సార్‌సీపీ విజయం చరిత్రాత్మకం అయింది. అందులోనూ అనేక మంది ఎమ్మెల్యేలు రికార్డు స్థాయి మెజార్టీలు సాధించారు.

జగన్‌కు అండగా నిలిచిన గౌతమ్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఆవిర్భారానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి జగన్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి వెంటనే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్‌ వెంట నడిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ కుటుంబ రాజకీయ వారసుడిగా, జగన్‌కు సన్నిహితుడుగా ఉండే మేకపాటి గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే చరిత్ర సృష్టించారు. వరుసగా రెండో పర్యాయం కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి, బడా కాంట్రాక్టర్‌ బొల్లినేని కృష్ణయ్యపై ఘన విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన ఎమ్మెల్యేగా ఖ్యాతి గాంచారు.   జిల్లాలో మంత్రి అవకాశం వచ్చే వారి పేర్లలో గౌతమ్‌రెడ్డి పేరు బలంగా వినిపించింది. చివరకు అదే నిజమై కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా పని చేస్తామని, జిల్లా అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతానని చెప్పారు.  
జగన్‌కు విశ్వాసపాత్రుడిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ జగన్‌కు విశ్వాసపాత్రుడిగా బలమైన ముద్ర వేసుకున్న నేత. కేవలం తన వాగ్ధాటితో రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేసి 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ 2014 ఎన్నికల్లో నగరం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండో పర్యాయం 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో సీఎంగా చెలామణిలో ఉన్న నారాయణపై ఘన విజయం సాధించి రాష్ట్రం లో అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్న వయస్సుల్లో అందులోనూ యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి అయిన నేతగా అనిల్‌ కుమార్‌ జిల్లాలో చరిత్ర సృష్టించారు. అనిల్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కల అది నెరవేరిందని, ఆయన కేబి నెట్‌లో చోటు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జగన్‌ ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన సాగించడానికి సమర్థవతంగా పనిచేస్తానని చెప్పారు.  

మేకపాటి గౌతమ్‌రెడ్డి
తల్లిదండ్రులు    :    మేకపాటి రాజమోహన్‌రెడ్డి(మాజీ ఎంపీ) – మణిమంజరి
పుట్టిన తేదీ    :    02.11.1971
విద్య           :    10వ తరగతి వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఉన్న గుడ్‌ షెప్పర్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో
గ్రాడ్యువేషన్‌    :    భద్రుకా కాలేజ్, హైదరాబాద్‌
మాస్టర్స్‌ డిగ్రీ    :    ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌ (యునైటెట్‌ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌)
వ్యాపారంలో ప్రవేశం    :    1997లో కె.ఎం.సీ కనస్ట్రక్షన్‌ కంపెనీలో..
రాజకీయ ప్రవేశం    :    2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి 31,438 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
:    2019లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా రెండోసారి 22,276 ఓట్ల ఆధిక్యంతో    గెలుపొందారు.
భార్య    :    మేకపాటి శ్రీకీర్తి
పిల్లలు    :    కుమార్తె – సాయి అనన్య కుమారుడు – కృష్ణార్జున్‌రెడ్డి
సోదరులు    :    మేకపాటి పృథ్వీరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి

పి.అనిల్‌కుమార్‌యాదవ్‌

తండ్రి     :    తిరుపాలయ్య(లేట్‌)
వయస్సు     :    38
కులం     :     యాదవ(బీసీ)
విద్యార్హత     :    బీడీఎస్‌ (ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, చెన్నై)
భార్య     ;    జాగృతి
పిల్లలు     :    సమన్వి, దర్శనందన్‌
రాజకీయ ప్రవేశం    :    2008లో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు
:    2009లో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు

:    2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు

:    2019లో రెండోసారి మంత్రి నారాయణపై గెలుపొందారు.

మరిన్ని వార్తలు