ఒకే వేదికపై ఆ ఇద్దరు

31 Jan, 2018 21:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం(ఫైల్‌ ఫొటో)

సీఎం నారాయణ స్వామి, కిరణ్‌ల ప్రత్యక్షం

సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి ఒకే వేదిక మీదకు వచ్చారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి అధికారం చేపట్టినప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి  ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. గవర్నర్‌ కావాలనే తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. పలు సార్లు కిరణ్‌బేడీ పర్యటనలను కూడా అడ్డుకునే విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.

ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్‌ నిర్ణయాల్ని సీఎం వ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి.  దీంతో వీరివురి సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహం చాలమంది అధికారపార్టీ నేతల్లో ఉండేది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వేదిక ముఖ్యమంత్రి, గవర్నర్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షించే రీతిలో కనిపించారు. ఇప్పటికైనా ఇరువురు తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమించాలని అటు ప్రజలు, ఇటు పార్టీల నేతలు ఆకాంక్షిస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు