ప్రతి ఏడాది అన్యాయమే..!

17 May, 2019 08:52 IST|Sakshi
పులివెందుల బ్రాంచ్‌ కెనాల్

సాక్షి, పులివెందుల రూరల్‌ : పులివెందుల ప్రాంత రైతులకు ప్రాణాధారమైన పులివెందుల బ్రాంచ్‌ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సిన 4.4 టీఎంసీల నీటి విడుదల విషయంలో ఈసారి కూడా రైతులకు నిరాశ మిగిలింది. కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి పులివెందుల ప్రాంతంలో ఉన్న సీబీఆర్‌కు ప్రతి ఏడాది 4.4 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రతి సంవత్సరం హెచ్‌ఎల్‌సీ అధికారులు అరకొరగా నీటిని విడుదల చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేదు. ఈ ఏడాది 4.4 టీఎంసీలకుగానూ.. 3.172 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఆ నీరు ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాదిలో కర్ణాటకలో బాగా వర్షాలు పడి తుంగభద్ర డ్యాంకు వరద నీటితో కళకళలాడింది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా అధికారులు పులివెందుల ప్రాంత రైతులపై పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నీటి కేటాయిపుల్లో అన్యాయం..  
ప్రతి ఏడాది సీబీఆర్‌కు నీటి కేటాయింపులలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు పండక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రబీలో సాగు చేసిన ధనియాలు, జొన్న, బుడ్డశనగ, వేరుశనగ పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఆగస్టులో అనంతపురంలో జరిగిన సాగునీటి సలహా కమిటీ ఇరిగేషన్‌ అడ్వయిజరీ సమావేశంలో పీబీసీకి 3.172 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్మానం చేశారు. కానీ ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. 

పీబీసీ కింద 50 వేల ఆయకట్టు..
పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా పీబీసీ కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పీబీసీకి 35ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఒక్కసారి (2014–15)మాత్రమే పూర్తి నీటిని విడుదల చేశారు. సీబీఆర్‌ నీటి కేటాయింపులో ప్రతి ఏడాది తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్‌సీ కాలువ ద్వారా మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసి అక్కడ నుంచి సీబీఆర్‌కు నీటిని విడుదల చేస్తారు. సీబీఆర్‌ ద్వారా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టుకు పైపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదైనా సీబీఆర్‌కు రావాల్సిన 4.4టీఎంసీల నీటిని వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు పేర్కొంటున్నారు.  

సీబీఆర్‌కు విడుదలైన నీటి కేటాయింపులు..  

మరిన్ని వార్తలు