‘నోటీసులపై అక్కడి ప్రభుత్వాన్ని అడగాలి’

14 Sep, 2018 13:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడంపై బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అరెస్ట్‌ వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై 2010లో కేసు నమోదైతే.. బీజేపీని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ఏం జరిగినా టీడీపీ నేతలు కేంద్రానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై అక్కడి ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యనించడం సరికాదని అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానిని తామే పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపులో అన్యాయం చేయలేదని తెలిపారు. సాంకేతికపరమైన అంశాల వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చని అన్నారు. అంతర్గతంగా చర్చించుకుని బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు