చంద్రబాబు సమాధానం చెప్పాలి : పురందేశ్వరి

29 Nov, 2019 12:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాజధాని అమరావతి నిర్మాణంలో పూర్తిగా విఫలమై, నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి శుక్రవారం ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్‌తో ఎందుకు మోసం చేశారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు.  రైతులడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 2500 కోట్లు ఇస్తే సరైన లెక్కలు చూపలేదని విమర్శించారు. రాజధానిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, వారిది కేవలం ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 

అమరావతి నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడని తాము మొదట్నుంచీ చెప్తున్నామని గుర్తు చేశారు. రాళ్లు, చెప్పులు వేయడం చంద్రబాబు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. బీజీపీ అధికార ప్రతినిధి సామంచి నివాస్‌ మాట్లాడుతూ.. తిరుపతిలో అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేస్తే, అధికారంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆయన పాలనలో బీజేపీ నేతలపై చాలా దాడులు జరిగినా ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు అమరావతిలో ప్రజలు ఆగ్రహంతో రాళ్లు విసిరితే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు