ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాల‌రావు?

29 Mar, 2018 15:52 IST|Sakshi
పైడికొండల మాణిక్యాలరావు

సాక్షి, హైదరాబాద్‌:  భారతీయ జనతా పార్టీ పై, ప్రధాని నరేంద్ర మోదీఫై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నతరుణంలో వారిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీకి స‌రైన కౌంట‌ర్ ఇచ్చే నాయకుడిని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి కంభంపాటి హరిబాబు తొలగించి.. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

కొత్త అధ్యక్ష ఎంపిక బాధ్యత‌ని అమిత్‌షా పూర్తిగా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ రాం మాధ‌వ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసులో ఒకే సామాజిక‌ వ‌ర్గానికి చెందిన‌ సోము వీర్రాజు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాణిక్యాల‌రావు పేర్లు వినిపించినా రాంమాధ‌వ్ మాణిక్యాల‌రావు వైపే మొగ్గు చూపుతున్నారని స‌మాచారం. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు నేతలకు కీలక బాధ్యతల్లో చోటు కల్పించాలని భావిస్తున్నారట. కానీ, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ముఖ్యనేతల భేటీ
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో రాంమాధవ్‌ బీజేపీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీని ఎలా కట్టడి చేయాలి, అధ్యక్ష పదవిని ఎవరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే అంశాలపై సీనియర్‌ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

అధ్యక్షుడిగా హరిబాబు ఫెయిల్‌?
ఇటీవల బీజేపీని టార్గెట్‌ చేసిన టీడీపీపై అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు తగినరీతిలో స్పందించలేకపోవడం, పలు సందర్భాల్లో ఆయన మెతక వైఖరి ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన నేతలు ఎప్పటికప్పడు టీడీపీపై దాడికి దిగుతున్నా, హరిబాబు మాత్రం దూకుడుగా వ్యవహరించలేదనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన స్ధానంలో మాణిక్యాల రావును నియమించేందుకు నిర్ణయం తీన్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. 
 

మరిన్ని వార్తలు