ఫీజు రీయింబర్స్‌ చేయకుంటే.. ఖబడ్దార్‌

5 Oct, 2018 01:40 IST|Sakshi

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించిన ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఫీజురీయింబర్స్‌మెంట్‌ కొత్త పథకం కాదు..ఎన్నికల నియమావళికి అసలే అడ్డంకి కాదు... గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకం ఇది అని’’బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ‘‘ఖబడ్దార్‌ కేసీఆర్‌ .. ఖచ్చితంగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేసి తీరాల్సిందే’’అని ఆయన హెచ్చరించారు. గురువారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ... ప్రపంచంలో ఏ విప్లవమైనా విద్యార్థుల ద్వారానే వస్తుందని తెలిపారు. ఈ సభ విద్యార్థులైన జీవితాల్లో గొప్ప ఘట్టంగా విగిలిపోతుందని తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు పంపిణీ చేసి బీసీలను కులవృత్తులకే పరిమితం చేయటం పెద్ద కుట్ర అని అభివర్ణించారు.తమకు చదువులు కావాలనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులందరికీ ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చేసి తీరాలని గట్టిగా చెప్పారు. మిషన్‌ భగీరథ లాంటి కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లలో కొంత ఫీజురీయింబర్స్‌కు కేటాయిస్తే విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకొంటారన్నారు.వారి స్కాలర్‌ షిప్‌ రూ.2 వేలకు పెంచాలన్నారు. హాస్టల్‌లో ఉంటున్న వారికీ స్కాలర్‌ షిప్‌లు ఇవ్వాలని చెప్పారు.పాకెట్‌ మనీగా ఆడపిల్లలకు రూ. 600, అబ్బాయిలకు రూ. 500 ఇవ్వాలని తెలిపారు.

రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేయకుండా పదవీవిరమణ చేసి వారిని 5 వేల మందిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులంతా వెనుకబడిన తరగతుల వారికి మేలు చేసేవారికే ఓటు వేయాలని కృష్ణయ్య కోరారు. 15 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు చెందిన గత ఏడాది ఫీజుల బకాయిలు రూ. 2,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల వారు సీఎం అయ్యే వరకు పోరాటం చేయాలని చెప్పారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ ఒకేరకమైన విద్యను అందిస్తామన్నారు. ప్రగతి భవన్‌ను సంక్షేమ కార్యాలయ భవన్‌గా మారుస్తామని తెలిపారు.బీసీ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేములు రామకృష్ణ, నీల వెంకటేశ్‌ లు మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ నేత ప్రొఫెసర్‌ ఆర్‌. విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బి.రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు