గొర్రెలు, బర్రెలు మాకు.. అసెంబ్లీ టికెట్లు వారికా? 

11 Sep, 2018 02:15 IST|Sakshi
బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

  బీసీలకు ఎక్కువ టికెట్లిచ్చిన పార్టీలకే మద్దతు: ఆర్‌.కృష్ణయ్య 

  బీసీ కులాల ప్రత్యేక పార్టీ ఏర్పాటు దిశగా కార్యాచరణ  

  బీసీలకు సీట్ల కేటాయింపులపై 112 సంఘాలతో చర్చ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలనలో బీసీ కులాలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చారని.. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మాత్రం అగ్రకులాల వారికే ఎక్కువ సీట్లిచ్చారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతానికిపైగా సీట్లు దక్కాలని.. బీసీలకు ప్రాధాన్యతనివ్వని పార్టీలకు ఇకపై గడ్డుకాలమేనని హెచ్చరించారు. సోమవారం సిద్ధార్థ హోటల్‌లో ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన 112 బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది.

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు బీసీ కులాలకు కేటాయించే సీట్ల అంశంపై విస్తృతంగా చర్చించారు. బీసీలకు ఎక్కువ సీట్లిచ్చిన రాజకీయ పార్టీలకే తమ కులాలు మద్దతు పలుకుతాయని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో బీసీలున్నప్పటికీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బీసీ కులాలతో ప్రత్యేక పార్టీ పెట్టాలనే డిమాండ్‌ వస్తుందని, త్వరలో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించనున్నట్లు స్పష్టంచేశారు.  

ఆ బాధ్యత కేంద్రానిదే.. 
జనాభాలో వెనుకబడిన వర్గాలు 50 శాతానికి పైగా ఉన్నారని, ఆ ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పనకు పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి ఆమోదింపజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు బీసీలకు కేటాయించకుంటే ఆయా పార్టీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నేతలు గుజ్జ కృష్ణ, కె.జనార్దన్, వి.వెంకటేశ్, సత్యనారాయణ, కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు