టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న బీసీ నేత?

10 Sep, 2018 12:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ‘ముందస్తు’ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాలన్ని కలిసి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి వ్యూహాలు రచిస్తుంది. దీనిలో భాగంగా మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. పొత్తులతో తమకు పదవీ గండం ఉందనే భయంతో కొందరు నేతలు తమకు అనుకూలంగా ఉండే విధంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానాలు నేతలను బుజ్జగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం బీసీ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పార్టీ తీరుపై అదేవిధంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

సీఎం అభ్యర్థినన్నారు.. అవమానించారు
2014ఎన్నికల్లో తనను టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. ఏనాడూ కనీస మర్యాద ఇవ్వలేదని ఆర్‌, కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అబిడ్స్‌ సిద్దార్థ్‌ హోటల్‌లో 112 బీసీ కులసంఘాలతో కలిసి రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు గురించి కనీసం ఒక్క మాటైనా తనతో చెప్పలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను, బీసీలను టీడీపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కావాలనే తనను దూరం పెడుతున్నాడని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రత్యేక పార్టీ పెట్టాలని కోరుతున్నారని వివరించారు. కొత్త పార్టీ పెట్టే విషయం, టీడీపీకి రాజీనామా చేసే విషయం త్వరలోనే వెల్లడిస్తానని కృష్ణయ్య స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు