తెరపైకి బీసీల పార్టీ! 

24 May, 2018 01:36 IST|Sakshi

ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జన సమితి..

ఆగస్టు రెండో వారంలో ఏర్పాటుకు సన్నాహాలు

ఎస్పీ, బీఎస్పీ సిద్ధాంతాలు, పూలే ఆశయాల కలబోతగా ఎజెండా 

వర్సిటీల్లోని బీసీ ప్రొఫెసర్లకు పార్టీ విధివిధానాల బాధ్యత 

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీసీ సామాజిక వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు బీసీ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పావులు కదుపుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీల సిద్ధాంతాలు, జ్యోతిరావు ఫూలే అభివృద్ధి పథకాల కలబోతగా ఆగస్టు రెండో వారంలో బీసీ జన సమితి పేరుతో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వేదికపై పార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి తదితర నేతలను ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

గద్దర్, కృష్ణమాదిగ మద్దతు 
ఇటీవల కేంద్ర నిఘా విభాగం చేసిన ఓ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌.కృష్ణయ్యకు వ్యక్తిగతంగా 35 శాతం ప్రజా మద్దతు వచ్చినట్లు తెలిసింది. బీసీ యువత, ఉద్యోగులు, విద్యార్థులు 75 శాతం మంది విశ్వాసం ప్రకటించినట్లు సర్వే తేల్చడంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లోని బీసీ నేతలతో ప్రాథమికంగా చర్చించిన ఆర్‌.కృష్ణయ్య వారి మద్దతు కూడగట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాన్షీరాం ఎజెండాతోపాటు బీసీల అభివృద్ధి కోసం జ్యోతిరావు ఫూలే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధ్యయనం చేసే బాధ్యత ఉస్మానియా, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీల్లోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లకు అప్పగించినట్టు తెలిసింది. దీనిపై అధ్యయనం చేసిన అనంతరం వారిచ్చే సలహాలు, సూచనలతో బీసీ జన సమితి ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు.

పంచకులాలే కీలకం.. 
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ముదిరాజులు, మున్నూరుకాపు, గొల్లకుర్మ, గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలు బలంగా ఉండటంతో ఈ పంచకులాలపైనే కృష్ణయ్య ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో 80 కుల సంఘాలతో నిర్వహించిన బీసీ సదస్సులో.. ఎవరు ఎంత మంది ఉన్నారో వారికి అన్ని సీట్లు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బీసీ జేఏసీని ఏర్పాటు చేసి రమణబాబు అనే పారిశ్రామిక వేత్తను దానికి చైర్మన్‌గా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు బీసీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, బీసీలకు స్కాలర్‌షిప్పులు, మెస్‌ చార్జీలు పెంచలేదని, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎన్నికలు వచ్చినా బీసీలకు అవకాశం ఇవ్వలేదని, అందువల్ల ఆయన్ను బీసీ వ్యతిరేకిగానే పరిగణించాలని సదస్సు అభిప్రాయపడింది. తెలంగాణలోనూ బీసీ వ్యతిరేక పాలన నడుస్తోందని, త్వరలోనే ఇక్కడా బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తామని కృష్ణయ్య సన్నిహితులంటున్నారు.   

మరిన్ని వార్తలు