దోషి భార్య తరపున రబ్రీ ప్రచారం

5 Apr, 2019 11:33 IST|Sakshi

పట్నా : మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో దోషి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా తేలిన రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ భార్య తరపున నవాడా లోక్‌సభ నియోజకవర్గంలో బిహార్‌ మాజీ సీఎం రబ్రీదేవి ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. నవాడాలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రబ్రీదేవి రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ను అక్రమంగా లైంగిక దాడి కేసులో దోషిగా ఇరికించారని, ఆయన భార్య విభాదేవిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

యాదవుల ప్రతిష్టను దిగజార్చేందుకు పాలకులు రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ను కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆయన భార్య విభాదేవిని నవాడా ఓటర్లు గెలిపించాలని కోరారు. గత ఏడాది డిసెంబర్‌లో పట్నా కోర్టు రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం కింద యాదవ్‌తో పాటు మరో నలుగురికి మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష విధించింది. నవాడా ఎంఎల్‌ఏ రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ 2016 ఫిభ్రవరి 6న బిహార్‌ షరీఫ్‌లోని తన నివాసంలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా చేర్చడంతో యాదవ్‌ను ఆర్జేడీ అదే ఏడాది ఫిబ్రవరి 14న ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.

మరిన్ని వార్తలు