నిరుద్యోగ భృతి కాదు.. టీడీపీ నేతల రాజకీయ భృతి

4 Oct, 2018 14:40 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : యువనేస్తం పథకం నిరుద్యోగ భృతి కోసం కాదని, టీడీపీ నేతల రాజకీయ భృతిగా మారిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని 36వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మరో ఐదారు మాసాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు గాలం వేయడానికి కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఇది అని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ కానీ శిక్షణా సంస్థలకు ఇచ్చే సొమ్ము మాత్రం ఎక్కువని చెప్పారు. ఈ శిక్షణా సంస్థలన్నీ చంద్రబాబు కుమారుడు లోకేష్‌ బినామీలవన్నారు. యువనేస్తం పథకం ద్వారా రూ. వందల కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధమైందన్నారు.  జిల్లాలో ప్రతి సంవత్సరం 25–30 వేల మంది డిగ్రీ పట్టా తీసుకుంటున్నారని, నాలు గేళ్లలో సుమారు  లక్షా 10 వేల మంది నిరుద్యోగులు సమాజంలోకి వస్తున్నారు. అయితే జిల్లాలో కేవలం 12 వేల మందిని మాత్రమే గుర్తించారన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులో 13 జిల్లాలకు సంబంధించి డిగ్రీ చదివిన వారి సమాచారం  తెప్పించుకోవచ్చని అన్నారు. ఎలాంటి వడబోత కార్యక్రమం లేకుండా డిగ్రీ చదివిన వారి అకౌంట్‌కు నేరుగా డబ్బు ట్రాన్స్‌పర్‌ చేయొచ్చన్నారు. యువనేస్తం పట్ల ఈ రాష్ట్రంలోని యువత ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారం, పది రోజుల తర్వాత తీవ్రమైన అలజడి మొదలవుతుంది.

నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై దీక్ష
నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై త్వరలో దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో కేవలం 1200 మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి, రాష్ట్రమంతా పంపిణీ చేశామని ఆర్భాటం చేస్తున్నారన్నారు. అర్హత పొందిన సంఖ్యను గుర్తించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. సమావేశంలో సీపీ నరసింహులు, శేఖర్‌రెడ్డి, దేవి, రాయుడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మైనారిటి నాయకుడు ఆయిల్‌మిల్లు ఖాజా, నల్లం రవిశంకర్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు