కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర ప్రతిపక్షనేత

19 Mar, 2019 15:31 IST|Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్షనేత రాధాకృష్ణ వీకే పాటిల్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపించారు. అయితే రాధాకృష్ణ రాజీనామాపై రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

రాధాకృష్ణ కుమారుడు సుజయ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన వారం రోజులకే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ తరఫున అహ్మద్‌నగర్‌ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన సుజయ్‌కు టికెట్‌ దక్కకపోవడంతోనే ఆయన పార్టీ మారినట్టుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్సీపీల పొత్తులో భాగంగా అహ్మద్‌నగర్‌ స్థానాన్ని ఎన్సీపీ దక్కించుకున్నట్టుగా సమాచారం. దీంతో సుజయ్‌కు బీజేపీ నుంచి ఆఫర్‌ రావడంతోనే పార్టీ మారారనే ప్రచారం జరుగుతోంది.

తన కుమారుడు పార్టీని వీడిన తరుణంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై రాధాకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శరద్‌ పవార్‌ పాత కక్షలను మనసులో ఉంచుకుని మాట్లాడటంతో తన కొడుకు కాంగ్రెస్‌ను వీడారని ఆరోపించారు. అయితే గతకొంతకాలంగా రాధాకృష్ణ వ్యవహార శైలిపై కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు