బాల్కొండ బరిలో వేముల ప్రశాంత్‌ సోదరి?

17 Oct, 2018 01:43 IST|Sakshi

రాధికారెడ్డిని బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం

పోటీ అంశమై ఇప్పటికే ఆమెతో చర్చించిన కాంగ్రెస్‌ పెద్దలు  

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రసవత్తర పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఇప్పటికే టికెట్‌ కేటాయించగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అనూహ్యమైన అభ్యర్థిని తెరపైకి తెస్తోంది. ప్రశాంత్‌రెడ్డి సొంత చెల్లెలు, దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి కుమార్తె రాధికారెడ్డిని బరిలో దింపాలని పావులు కదుపుతోంది. జౌళిశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న రాధికతో ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలు మంతనాలు జరిపారని, అన్నపై పోటీ చేసేందుకు ఆమెను దాదాపు సంసిద్ధురాలిని చేశారని సమాచారం.

నిజానికి పార్టీ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన జాబితాలో రాధికారెడ్డి పేరు ఎక్కడా లేదు. ఇటీవల స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా అనూహ్యంగా రాధికారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని కమిటీ దృష్టికి తెచ్చారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రశాంత్‌రెడ్డిని బాల్కొండలో ఓడించాలంటే, అదే నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, వేల్పూర్, భీంగల్‌లో దివంగత సురేందర్‌రెడ్డి అనుచరవర్గంతో సాన్నిహిత్యం ఉన్న రాధికను నిలబెట్టాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఈ నేపథ్యంలో రాధికారెడ్డిని బాల్కొం డ బరిలో నిలిపే అంశమై పార్టీ పెద్దలు, జిల్లా నేతల నుంచి స్క్రీనింగ్‌ కమిటీ అభిప్రాయాలు సేకరిం చింది. ఆమె అభ్యర్థిత్వంపై సానుకూలత రావడంతో పార్టీ పెద్దలు కొందరు నేరుగా రంగంలోకి దిగి ఆమె తో చర్చలు జరిపారు. పోటీ అంశమై ఆమె అభిప్రాయాన్ని తీసుకున్నారు. తన తండ్రి ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నానని తెలిపిన ఆమె, టికెట్‌ ఇస్తే పోటీకి సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చినట్లుగా తెలిసింది.

అధికారికంగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఈరవత్రి అనిల్‌ సైతం టికెట్‌ రేసులో ఉన్నా రు. రాధికను నిలబెట్టాలని భావిస్తే అనిల్‌కు పార్టీ ఎలాంటి హామీ ఇస్తుంది, అందుకు ఎలా ఒప్పిస్తారన్నది కీలకంగా మారింది. ఒకవేళ రాధికను బరిలోకి దింపితే మాత్రం బాల్కొండలో అన్నాచెల్లెళ్ల మధ్య ఆసక్తికర పోరు తప్పదనే వాదన వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు