ఎస్పీ, బీఎస్పీ కలిస్తే బీజేపీకి కష్టమే!

22 Sep, 2018 04:57 IST|Sakshi
యోగి, అఖిలేశ్, మాయావతి

యూపీలో బీజేపీకి విపక్ష కూటమి చిక్కులు..

ప్రధానిగా మోదీకి 48%.. రాహుల్‌కు 22% సమర్థన

సీఎంగా యోగికి 43%, అఖిలేశ్‌కు 29% మద్దతు

ఇండియాటుడే సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం స్పష్టంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికీ.. ఎస్పీ–బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని స్పష్టమైంది. 47% మంది ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడగా.. 32% మంది కూటమి ప్రభావం ఉండదని.. 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు.

ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్‌ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని కోరుకోగా.. 22% మంది రాహుల్‌ గాంధీ వైపు మొగ్గుచూపారు. 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా.. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో విజయ దుందుభి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.
 
ప్రధానిగా మోదీ భేష్‌ : వారణాసి ఎంపీగా ఉన్న నరేంద్ర మోదీ పాలనపై 53% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. 16%మంది పర్వాలేదన్నారు. 28% మాత్రం కేంద్రం పాలన బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఎస్సీల్లో 39% మోదీకే జై కొట్టగా.. మాయావతికి 24%, రాహుల్‌కు 20%, అఖిలేశ్‌కు 4%మంది మద్దతు తెలిపారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శల ప్రభావం యూపీలో పెద్దగా కనిపించలేదు. 79% మంది తమకు రాఫెల్‌ వివాదం గురించి తెలియదని వెల్లడించారు.

సీఎంగా యోగి ఓకే!
ఉత్తరప్రదేశ్‌ తదుపరి సీఎంగా యోగికి 43% మంది మద్దతు తెలుపగా.. అఖిలేశ్‌కు 29%, మాయావతికి 18% మంది ఓటేశారు. సీఎంగా యోగి పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా.. 20%మంది పర్వాలేదన్నారు. 37% మందిలో మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే.. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు. ముస్లింలు అఖిలేశ్‌కు (71%), ఎస్సీలు మాయావతికి (49%) మద్దతు ప్రకటించారు.  

పీఎం ఓకే.. కానీ ముఖ్యమంత్రే?
ఉత్తరాఖండ్‌లో బీజేపీకి భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా.. సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌పై స్వల్ప వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రధానిగా మోదీకి 57% మంది, రాహుల్‌కు 32%మంది మద్దతు తెలిపారు. మోదీ పాలనపై 45% సంతృప్తి వ్యక్తం చేయగా.. 23% పర్వాలేదని, 24% బాగాలేదని అభిప్రాయపడ్డారు. అయితే సీఎంగా రావత్‌ పనితీరుపై 35% మంది అసంతృప్తిని వ్యక్తం చేయగా.. 30% బాగుందని, 29% పర్వాలేదని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ–ఎస్పీ జోడీ ప్రభావం బీజేపీపై ఉంటుందా? అన్నప్రశ్నకు అవును అని 47% మంది, చెప్పలేమని 21% మంది, ప్రభావం  ఉండదని 32%మంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు