రాఫెల్‌: రాహుల్‌ స్ట్రాటజీ వర్కవుట్‌ అవుతుందా?

15 Oct, 2018 16:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశ్‌ కీ చౌకీదార్, అనిల్‌ అంబానీ కా చౌకీదార్‌ బన్‌గయా’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ‘రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోల్‌మాల్‌’ను సజీవంగా ఉంచి లబ్ధి పొందాలని రాహుల్‌ చూస్తున్నారు. ఆయన వ్యూహం ఫలించేనా? 1437 కోట్ల రూపాయల బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోల్‌మాల్‌లో కేవలం 65 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణల కారణంగా నాడు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. నేడు ఏకంగా 58 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లలో వేలాది కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందా? అసలు ఈ ఆరోపణలను జనం నమ్ముతారా? నమ్మితే ఎంతవరకు?

బోఫోర్స్‌ కుంభకోణాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో నాడు వీపీ సింగ్‌ విజయం సాధించారు. నాడు మీడియా కూడా కుంభకోణాన్ని ఊదరగొట్టింది. నేడు వీపీ సింగ్‌ లాంటి నాయకుడు లేరు. నాటి లాగా నేటి మీడియా లేదు. నాడు రాజీవ్‌ గాంధీని సమర్థుడైన నాయకుడని మధ్యతరగతి ప్రజలు నమ్మలేదు. నేడు నాలుగేళ్ల పాలనలో చెప్పుకోతగ్గ అభివద్ధి ఏమీ సాధించకపోగా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు భూమరాంగ్‌ అయినా మోదీని ఇప్పటికీ మధ్య తరగతి ప్రజలు విశ్వసిస్తున్నారు. రాహుల్‌ గాంధీని ఇంకా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాఫెల్‌ యుద్ధ విమానాల్లో భారీ కుంభకోణం జరిగిందంటూ రాహుల్‌ గాంధీ సహేతుకంగానే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అది సామాన్య ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ఈ కారణాలతోపాటు ఆయన ఉపన్యాస ధోరణి కూడా కారణమే.

ఈ మధ్య కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నప్పటికీ అది రాయించుకున్న స్క్రిప్టును వల్లెవేసినట్లుగా ఉంటుందని తోటి కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారు. ఆయన ఉపన్యాస ధోరణి పట్టణ ప్రజలను ఆకర్షించకపోగా గ్రామీణ ప్రజలకు అర్థం కావడం లేదు. రాహుల్‌ గాంధీ ఫ్రాన్స్‌ నుంచి తీసుకొచ్చిన ఈ ‘రఖేల్‌’ వివాదం ఏమిటని తమను గ్రామీణ ప్రజలు అప్పుడప్పుడు అడుగుతుంటారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని యూపీ కాంగ్రెస్‌ నాయకుడొకరు చెప్పారు. రాఫెల్‌ వివాదానికి సంబంధించి రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణలు రెండు. ఒకటి యూపీఏ ప్రభుత్వంలో చర్చలు జరిపినప్పటితో పోలిస్తే ఒప్పందం విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రెండు, ఒప్పందంలో మార్గదర్శకాలను మార్చి ఫ్రాన్స్‌ కంపెనీ భారతీయ భాగస్వామి కంపెనీగా అనిల్‌ అంబానీ కంపెనీని ఎంపిక చేసుకోవడం, అందులోనూ యుద్ధ విమానాల ఉత్పత్తిలో అణు మాత్రం అనుభవంలేని, అప్పటి​కీ పుట్టని అనిల్‌ అంబానీ కంపెనీని ఎంపిక చేయడం.

వివాదాన్ని సజీవంగా ఉంచాలనే..
రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణాన్ని రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచాలనే కాంగ్రెస్‌ పార్టీ దీన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లింది. ఈ కేసును బుధవారం నాడు విచారించిన సుప్రీంకోర్టు, ఒప్పందం చేసుకోవడానికి అనుసరించిన చర్చల ప్రక్రియ ఏమిటో తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీల్డ్‌ చేసిన కవర్లో వీటి వివరాలను అక్టోబర్‌ 29వ తేదీలోగా అందజేయాని, 31 నాడు విచారణ జరుగుతుందని తెలిపింది. ఒప్పందం విలువ అనూహ్యంగా పెరగడానికి కారణాలనుగానీ, హెచ్‌ఏఎల్‌కు బదులు రిలయెన్స్‌ను ఎంపిక చేయడానికి కారణాలుగానీ అడగకుండా జనాంతికంగా చర్చల ప్రక్రియను సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిందంటే కేసు కూడా ఎక్కువ కాలం నిలబడక పోవచ్చు.

అదేపనిగా ప్రచారం
తోటి ప్రతిపక్ష పార్టీల నాయకులెవరూ రాఫెల్‌ ఒప్పందాన్ని పట్టించుకోకపోయినా రాహుల్‌ గాంధీయే ప్రధాన ఆయుధంగా ప్రచారం చేస్తున్నారు. అది పార్లమెంట్‌ వేదికైనా, ఎన్నికల ర్యాలీ అయినా, లండన్‌ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడినా రాఫెల్‌ వివాదాన్నే అందుకుంటున్నారు. రిలయెన్స్‌ కంపెనీని ఎంపిక చేసుకోవడం తమకు తప్పనిసరైందంటూ రాఫెల్‌ యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసే డిసౌ కంపెనీ ప్రతినిధులు చెప్పడాన్ని ఉటంకిస్తూ తాజాగా ఫ్రెంచ్‌ వెబ్‌సైట్‌ ‘మీడియాపార్ట్‌’ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించినప్పుడు కూడా రాహుల్‌ ఈ వివాదాన్ని అందుకున్నారు. ఈ వివాదం గ్రామీణ జనం వరకు వెళ్లగలదా? విజయాన్ని సాధించపెట్టగలదా? అన్నది ఇప్పటికైతే అనుమానమే!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా