అంబానీ జేబులోకి పేదల సొమ్ము

25 Sep, 2018 05:09 IST|Sakshi
సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి వస్తున్న కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

మోదీపై రాహుల్‌ మండిపాటు

రాఫెల్‌ డీల్‌ వివరాల్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌

సీవీసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదల డబ్బు దోచుకుని పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీకి ధారపోస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ‘దేశానికి కాపలా దారుగా (చౌకీదార్‌) ఉన్న వ్యక్తి పేద ప్రజలు, అమరవీరులు, జవాన్ల జేబుల్లో నుంచి రూ. 20 వేల కోట్లు తీసుకుని.. వాటిని అంబానీ జేబులో పెట్టారు. ప్రధాని అవ్వగానే ‘చౌకీదార్‌జీ’ నేరుగా ఫ్రాన్స్‌ వెళ్లి ఆ దేశాధ్య క్షుడితో ఒప్పందం చేసుకున్నారు. హెచ్‌ఏఎల్‌ను కాదని అనిల్‌ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వమని కోరారు’ అని ఆరోపించారు. అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోమవారం మాట్లాడుతూ.. రాఫెల్‌ ఒప్పందం విలువను ఎందుకు బయటపెట్టడం లేదని, అంబానీకి కాంట్రాక్టు ఎలా దక్కిందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.   

కుట్రలో పాకిస్తాన్‌ పాత్ర: బీజేపీ
రాఫెల్‌ ఒప్పందం రద్దుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో రాహుల్‌ గాంధీ పాత్ర ఉందని, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్‌ హోలండ్‌ అందులో భాగమని బీజేపీ ఆరోపించింది. బావ రాబర్ట్‌ వాద్రాకు సంబంధమున్న కంపెనీకి సాయం చేసేందుకు ఒప్పందం రద్దును రాహుల్‌ కోరుకుంటున్నారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు. వాద్రాకు సంబంధమున్న కంపెనీని రాఫెల్‌ ఒప్పందంలో మధ్యవర్తిగా తీసుకోకపోవడంతో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకుందన్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్‌ పాత్ర ఉందని కూడా షెకావత్‌ చెప్పారు. తదుపరి భారత ప్రధాని రాహుల్‌ అంటూ పాకిస్తాన్‌ మాజీ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ ట్వీట్‌ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. తనపై ఆరోపణల్ని వాద్రా తోసిపుచ్చారు.

నిజాలు నిగ్గుతేల్చండి: రాఫెల్‌ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)కు కాంగ్రెస్‌ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సీవీసీ కేవీ చౌదరీకి పూర్తి వివరాలతో మెమొరాండం సమర్పించింది. ఖజానాకు ప్రభుత్వం నష్టం చేకూర్చిందని, కొందరు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను పక్కనపెట్టి దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్‌ బృందం అందులో ఆరోపించింది. ‘రాఫెల్‌ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రక్షణ రంగ కుంభకోణం. రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ అవినీతి జాడలు బయటపడుతున్నా.. రక్షణ శాఖ నుంచి ఎలాంటి సమాధానం లేదు. రాఫెల్‌ ఒప్పందంలోని అవినీతి, ఆశ్రిత పక్షపాత దుర్గంధం రోత పుట్టిస్తోంది. ఇందులో మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలి’ అని కాంగ్రెస్‌ కోరింది.
 

మరిన్ని వార్తలు