కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

22 Nov, 2019 11:12 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు. చిత్రంలో మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి

నాడు పెత్తనం చెలాయించిన వారంతా నేడు ఫిరాయించారు 

పార్టీ మనుగడ కోసమే చంద్రబాబు పర్యటన

సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వారంతా నేడు బీజేపీలోకి ఫిరాయించారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 24,25, 26 తేదీల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెబుతున్నారని, ఆయన పర్యటన ఖరారై రెండు సార్లు రద్దయిందన్నారు. ఎంపీ సీఎం రమేష్‌ బీజేపీలోకి వెళ్లడంతో మొదటిసారి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ మారడంతో మరోసారి రద్దయిందని చెప్పారు. కడప పర్యటన చంద్రబాబుకు అచ్చి రావడం లేదని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మూడు రోజులు పర్యటించని ఆయన ఇప్పుడు మూడు రోజులు పర్యటించడానికి గల కారణాలేమిటో చెప్పాలన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను హతమార్చి, అనేక మందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఆనాడు తీవ్రంగా నష్టపోయి అన్యాయానికి గురైన వారు నేడు స్పందన కార్యక్రమంలో అధికారులకు మొరపెట్టుకుంటున్నారని, పోలీసులు వారి అర్జీలపై నిష్పాక్షికంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కోడెల శివప్రసాద్‌రావు, చింతమనేనిపై పెట్టిన కేసులు ఈ కోవలోకే వస్తాయన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక కాలువగట్లపై పడుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మాటను గాలికొదిలేసి ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లిస్తున్నామని చెప్పి ఒక్క చుక్క ఇవ్వకపోయినా రూ.1600కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అన్న బాబు ఎంపీ సీఎం రమేష్‌తో 12 రోజులు దొంగ దీక్ష చేయించారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది రైతులు, అగ్రిగోల్డ్, కాల్‌మనీ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుతిన్నారని, సామాన్య రైతులకు ఎక్కడా ఇసుక ఉచితంగా లభించలేదన్నారు. తమ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి నూతన ఇసుక పాలసీ అమలు చేస్తుంటే నాడు ఇసుక మాఫియా వ్యవహించిన వారంతా ఇబ్బంది పడుతూ రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 1.50లక్షల సచివాలయ ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హెల్త్‌ డ్రింక్‌ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం దుకాణాలు, బార్లను తగ్గించి, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు.    

కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్రానికి వినతి 
జిల్లాలో పండిస్తున్న కేపీ ఉల్లిని ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, కరిముల్లా పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా