‘20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా లేదు’

3 Sep, 2018 14:18 IST|Sakshi
ఏపీసీసీ చీఫ్‌ రఘవీరారెడ్డి(పాత చిత్రం)

సాక్షి, విజయవాడ: 20 ఏళ్లు అయినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని ఏపీసీసీ చీఫ్‌ రఘవీరారెడ్డి అన్నారు. సోమవారం ఏపీసీసీ కార్యాలయంలో రఘవీరా మీడియాతో మాట్లాడుతూ.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని తెలిపారు. పోలవరం నిర్వాసితులు, పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు భరోసా కలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు, వైద్యం సరిగా అందడం లేదన్నారు. నష్ట పరిహారం విషయంలో నిర్వాసితులను గిరిజన, గిరిజనేతరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి లేఖ రాస్తున్నట్టు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు వర్ణాతీతంగా ఉన్నాయని అన్నారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టు గురించి కాకుండా నిర్వాసితుల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. 20 తేదీలోపు నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్లమని పేర్కొన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ 6 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఈ నెల 18న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా దామోదరం సంజీవయ్య ఇంటిని రాహుల్‌ సందర్శిస్తారని.. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారని.. ఆ తర్వాత కర్నూల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలిపారు.

రాఫెల్‌ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
రాఫెల్‌ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రఘవీరారెడ్డి విమర్శించారు. 500 కోట్లతో కొనుగోలు చెయాల్సిన ఒక యుద్ధ విమానానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రాఫెల్‌ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 24వ తేదీన రాష్ట్ర నాయకత్వం మొత్తం విజయవాడ వేదికగా నిరసన తెలుపుతుందని ప్రకటించారు. ఆ రోజున గవర్నర్‌ నరసింహాన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిందిగా కోరారు.

మరిన్ని వార్తలు