‘బాబు-బీజేపీలది డ్రామా’

25 Mar, 2018 14:35 IST|Sakshi

అమిత్‌షా-చంద్రబాబులపై విరుచుకుపడ్డ ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీలు ఇంకా డ్రామాలు ఆడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి  మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు 5 కోట్ల ప్రజలను నమ్మించి దారుణంగా మోసం చేశాయని.. ప్రజలు ఇంకా వారిని నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విజయవాడలో ఆదివారం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘అమిత్ షా, చంద్ర‌బాబు ఇద్ద‌రూ నాటకాలాడుతున్నారు. 4 ఏళ్ళు కలిసి ఉండి ఇప్పుడు ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా మారినట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో అమిత్ షా రూ. 1.40లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సింది. ఇప్పుడు నిలదీయటం వ్యర్థం. ప్రధాని మోదీ-అమిత్‌షాలు అబద్ధాలకోరులు.. వారికీ విశ్వసనీయత లేదు’ అని రఘువీరా పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ త్యాగం చేసింది : విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని.. చిత్తశుద్ధితో పోరాడేది.. చివరకు 2019లో హోదాను ఇచ్చేది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని రఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే టీడీపీ-బీజేపీ కుట్ర చేశాయన్నారు.  ‘విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయింది. కానీ, రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయడానికి ప్రయత్నించింది. ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే.. దాన్ని బీజేపీ-టీడీపీలు అవకాశవాద రాజకీయాలతో కుక్కలు చింపిన విస్తరి చేశాయి. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ దెబ్బతీస్తే.. చంద్రబాబు 5 కోట్ల ప్రజల హక్కులను కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టారు’ అని చెప్పారు.

ఇంక తప్పించుకోలేరు... కాంగ్రెస్‌ పార్టీపై ఇంకా నిందలేసి ఇక బీజేపీ, టీడీపీలు తప్పించుకోలేవని.. వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రఘువీరా అన్నారు.  ‘కాంగ్రెస్‌ ఇచ్చిన అమలు చేయమనే ఇవాళ అందరూ అడుగుతున్నారు. హోదాతోసహా ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి నెరవేరతాయి. అసత్యాల అమిత్ షా, మోసకారి మోదీ, వెన్నుపోటు చంద్రబాబు.. వీరంతా ఏపీని ముంచినోళ్లే’ అని రఘువీరా ఆక్షేపించారు.

>
మరిన్ని వార్తలు