మోదీ ఓడిపోతారు.. రాహుల్‌ జోస్యం

12 Apr, 2019 08:02 IST|Sakshi

రఫేల్‌పై చర్చకు రావాలని సవాల్‌ 

రాయ్‌బరేలీ: రఫేల్‌ రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శల పదును పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు. మోదీ అజేయుడు కాదన్న తన మాటలు ఎన్నికల తర్వాత రుజువు అవుతాయని పేర్కొన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి రాహుల్‌ తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రాహుల్‌ మాట్లాడారు. గత ఐదేళ్లలో మోదీ ఏమీ చేయలేదని ఆరోపించారు.

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రివ్యూ పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించడం కేంద్రానికి చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు. రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో బహిరంగ చర్చకు రావాలని, లేదంటే తానే ప్రధాని నివాసానికి వచ్చి చర్చలో పాల్గొంటానని ప్రధాని మోదీకి మరోసారి సవాల్‌ విసిరారు. ఒకవేళ చర్చ జరిగితే మోదీ.. ఎవరి కళ్లలోకి కూడా నేరుగా చూడలేరని ఎద్దేవా చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీకి దక్కాల్సిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం అనిల్‌ అంబానీకి ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. 

వివేకంతో ఓటేయండి 
దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని ఓటర్లకు రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. మోదీ అధికారంలోకి రాకముందు రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటికి బదులు నిరుద్యోగం, అపనమ్మకం, హింస, ద్వేషం, భయాలను దేశ ప్రజలకు ఇచ్చారని ఓటర్లకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల్లేవు. రూ.15 లక్షలు లేవు. దీనికి బదులు నోట్ల రద్దు, గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్, రైతులకు బాధలు, సూటు బూటు సర్కారు, రఫేల్‌.. అబద్ధాలు.. అబద్ధాలు.. అపనమ్మకం, హింస, ద్వేషం, భయం ఇచ్చారు’అని ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు