‘కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టు’

5 May, 2018 14:17 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

బీజేపీ అభ్యర్థుల జాబితాపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్య

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు కొనసాగించారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను ఉద్ధేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎంపిక అభ్యర్థుల ఎంపికలా కాక మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్తుల జాబితాల ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదంటూ విమర్శించారు. ప్రధాని మోదీని ఉద్ధేశిస్తూ 80 సెకన్ల వీడియోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు టికెట్టు ఇవ్వడాన్ని తప్పుపడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 మంది అభ్యర్ధుల గురించి ఏం సమాధానం చెప్తారంటూ మోదీని నిలదీసారు.

‘ప్రియమైన మోదీగారు.. మీరు చాలా బాగా మాట్లాడతారు. కానీ సమస్య ఏంటంటే మీరు చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. మీ మాటల్లో ఉన్న నిజాయితీ కర్ణాటక బీజేపీ అభ్యర్థుల ఎంపికలో లేదు. మీరు ఎంపిక చేసిన అభ్యర్ధులను చూస్తే వారందరిని ఎన్నికల్లో పోటి చేయడానికి ఎంపిక చేసినట్లు లేదు, ‘కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌’ నేరస్తుల జాబితాను విడుదల చేసినట్లు ఉంది. అవినీతిపరులైన గాలి సోదరులకు అత్యంత సన్నిహితులైన ఎనిమిది మందికి టికెట్లు‌ ఇచ్చారు. ఈ విషయంపై ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలరా? బీజేపీలోని 11 మంది అగ్రనేతల అవినీతిని గురించి ఎప్పుడు మాట్లాడతారు? గాలి జనార్దన్‌ రెడ్డి సోదరుడైన సోమశేఖర రెడ్డిపై ఐదు క్రిమినల్‌ కేసులున్నాయి. కంపాలి నుంచి పోటీ చేస్తున్న గాలి అనుచరుడిపై ఆరు క్రిమినల్‌ కేసులున్నాయి. వీటన్నింటిపై మీరు నోరువిప్పుతారని ఆశిస్తున్నాను. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను’ అంటూ రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా మోదీకి సవాల్‌ విసిరారు.

కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు ఏడు రోజులే సమయం ఉన్నందున ప్రధాన పార్టీలు విమర్శల ధాటిని పెంచాయి. ఈనెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు