జైట్లీ కుమార్తె ఖాతాలోకి చోక్సీ డబ్బు

23 Oct, 2018 03:12 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌ రైతు ర్యాలీలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ఆరోపణ

అధికారమిస్తే 10 రోజుల్లో రుణమాఫీ చేస్తాం

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లక్ష్యంగా సోమవారం విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ నుంచి జైట్లీ కుమార్తె రూ.24 లక్షలు తీసుకుందని ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు మీడియా భయపడుతోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన రైతుల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘దేశం నుంచి రూ.35,000 కోట్ల నిధులతో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీల గురించి మీరు వినే ఉంటారు. చోక్సీ రూ.24 లక్షలను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశారు. కానీ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఈ విషయాన్ని ప్రసారం చేయడం లేదు. నిజాన్ని బయటపెట్టాల్సిన మీడియా సంస్థలు బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయి’ అని తెలిపారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కాంట్రాక్టు నుంచి ప్రభుత్వ రంగ హాల్‌ సంస్థను తప్పించిన ప్రధాని మోదీ.. కనీసం కాగితపు విమానాన్ని తయారుచేసిన అనుభవం కూడా లేని రిలయన్స్‌ సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని ఎద్దేవా చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 10 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్‌ ప్రకటించారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ కుమారుడు అభిషేక్‌ సింగ్‌ పేరు రావడంపై స్పందిస్తూ.. ‘పనామా వ్యవహారంలో పేరు వచ్చినందుకు అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఏకంగా జైలు పాలయ్యారు. కానీ ఇక్కడ మాత్రం అభిషేక్‌ సింగ్‌పై కనీసం చర్యలు కూడా తీసుకోలేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగిస్తే ప్రతి జిల్లాలో ఓ ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి, అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఆదివాసీ, రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన చట్టాలన్నింటిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ కార్యకర్తలను కోరిన రాహుల్‌.. కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యే టికెట్లను కేటాయిస్తామనీ, చివరి నిమిషంలో కాంగ్రెస్‌లోకి వచ్చినవారికి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను డిసెంబర్‌ 11న ప్రకటించనున్నారు.  

రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు
చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధిస్తే రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్‌ చెప్పలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో పాటు కేంద్రంలో ప్రగతిశీల ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న లక్ష్యమని వెల్లడించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించలేదు. రాహుల్‌ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఒకరిద్దరు నేతలు ఈ విషయమై మాట్లాడినా, ఇకపై దీనిపై చర్చించరాదని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వారికి సూచించింది. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాకు పట్టింపులేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మిత్రపక్షాలతో చర్చించి ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు