మోదీ పెద్ద అవినీతిపరుడు

12 Oct, 2018 02:46 IST|Sakshi

‘రఫేల్‌’లో ఆయన పాత్రపై దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ డిమాండ్‌  

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ ఫైటర్‌జెట్ల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఓ అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. 36 రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు ద్వారా తన స్నేహితుడు అనిల్‌ అంబానీకి మోదీ రూ.30,000 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారని విమర్శించారు. ఆయన దేశ ప్రజలకు ప్రధాని కాదనీ, అనిల్‌ అంబానీకి మాత్రమే ప్రధానమంత్రి అని రాహుల్‌ ఎద్దేవా చేశారు. యుద్ధ విమానాల కాంట్రాక్టు దక్కాలంటే రిలయన్స్‌ డిఫెన్స్‌తో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలని నిబంధన ఉన్న పత్రాన్ని ఉటంకిస్తూ ఫ్రాన్స్‌కు చెందిన మీడియా సంస్థ ‘మీడియా పార్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్‌.. ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

రక్షణ మంత్రి ఫ్రాన్స్‌ పర్యటనపై...
రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రాత్రి ఫ్రాన్స్‌ పర్యటనకు అకస్మాత్తుగా బయలుదేరి వెళ్లడంపై రాహుల్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘రక్షణమంత్రి అత్యవసరంగా ఫ్రాన్స్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మోదీ స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు నిజం ఏంటంటే భారత ప్రధాని మోదీ ఓ అవినీతిపరుడు. అవినీతిపై పోరాడతానని వాగ్దానమిచ్చి మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రఫేల్‌ ఒప్పందం సందర్భంగా జరిగిన అవినీతిలో ఆయన భాగస్వామి అయ్యా రు. ఆయన ఈ దేశానికి ఎంతమాత్రం ప్రధాని కాదు. మోదీ అనిల్‌ అంబానీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారు’ అని ఆరోపించారు.

మీడియా కథనంపై స్పందించిన డసో..
మీడియా పార్ట్‌ బుధవారం ప్రచురిం చిన కథనంపై డసో ఏవియేషన్‌ స్పందించింది. తమ భారత భాగస్వామిగా రిలయన్స్‌ను స్వతంత్రంగానే ఎంపిక చేసుకున్నామనీ, ఇందులో ఎవరి ఒత్తిడి లేదంది. ప్రస్తుతం తాము బీటీఎస్‌ఎల్, డీఈఎఫ్‌ఎస్‌వైఎస్, కెనిటిక్, మహీంద్రా, మైనీ, శామ్‌టెల్‌ వంటి భారతీయ కంపెనీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించింది. మరో వంద కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేయడంపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు రఫేల్‌ ఆరోపణలతో రాహుల్‌ గాంధీ జాతీయ భద్రతను అపహాస్యం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. అబద్ధాలతో తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకునేందుకు రాహుల్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు