రాహుల్‌కు బుజ్జగింపులు

2 Jul, 2019 03:57 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న గహ్లోత్‌. చిత్రంలో అమరీందర్, కమల్‌నాథ్‌

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగాలి: గహ్లోత్‌

రాహుల్‌ను కలిసిన ఐదుగురు కాంగ్రెస్‌ సీఎంలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న రాహుల్‌ గాంధీని బుజ్జగించేందుకు సోమవారం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులంతా రంగంలోకి దిగారు. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల సీఎంలు వరుసగా అశోక్‌ గహ్లోత్, అమరీందర్‌ సింగ్, కమల్‌నాథ్, భూపేశ్‌ బఘేల్, వి.నారాయణస్వామిలు రాహుల్‌ను ఢిల్లీలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై వారు దాదాపు రెండు గంటలపాటు చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాహుల్‌ను వారంతా అభ్యర్థించారు.

భేటీ అనంతరం గహ్లోత్‌ మాట్లాడుతూ ‘మేమంతా రాహుల్‌తో మనసువిప్పి మాట్లాడుకున్నాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల గురించి కూడా రాహుల్‌కు వివరించాం. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం. ఆయన మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌ మాత్రమే పార్టీని నడిపించగలరని గట్టిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రాహుల్‌ చెప్పడం, అప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతలు ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. ఇటీవలే 150 మంది కాంగ్రెస్‌ నాయకులు కూడా ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామా చేయడం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా