గాంధీజీ భారత్, గాడ్సే భారత్‌

12 Mar, 2019 04:04 IST|Sakshi

ఏది కావాలంటూ సమావేశంలో కార్యకర్తలను ప్రశ్నించిన రాహుల్‌

న్యూఢిల్లీ: ప్రేమను పంచే మహాత్మాగాంధీ భారత్, ద్వేషాన్ని నూరిపోసే గాడ్సే భారత్‌.. ఇందులో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రజలను కోరారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ బూత్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గాంధీజీ భారత్‌ లేక గాడ్సే భారత్‌.. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఒక వైపు ప్రేమ, సోదరభావం, మరో వైపు ద్వేషం, భయం. గాంధీజీకి భయం లేదు. ఎన్నో ఏళ్లు జైలు జీవితం గడిపారు.

అయినప్పటికీ అప్పటి బ్రిటిష్‌ పాలకులతో ప్రేమగానే మాట్లాడారు. కానీ, వలస పాలకులపై ద్వేషాన్ని నూరిపోసిన వీర సావర్కర్‌ మాత్రం తనను క్షమించి వదిలేయాలంటూ బ్రిటిష్‌ వారిని ప్రాధేయపడ్డారు’ అని తెలిపారు.  ‘మేకిన్‌ ఇండియా అంటూ తరచూ మాట్లాడే మోదీ.. ధరించే దుస్తులు, చెప్పులు, సెల్ఫీలు తీసుకునే ఫోన్‌..ఇవన్నీ చైనాలో తయారైనవే’ అంటూ ఎద్దేవా చేశారు.  మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేశామన్నారు.  

నేడు సీడబ్ల్యూసీ భేటీ
అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన రెండు రోజులకే ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ల స్వరాష్ట్రమైన గుజరాత్‌ నుంచి దేశానికి గట్టి రాజకీయ సందేశం ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరుకుటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ గాంధీ ఆశ్రమంలో ప్రార్థనా సమావేశం నిర్వహించి, ఆ తర్వాత సర్దార్‌ పటేల్‌ జాతీయ స్మారకంలో సీడబ్ల్యూసీ భేటీ అవనుంది.

మరిన్ని వార్తలు