2024 నాటికైతే ప్రధానిగా రాహుల్‌ ఓకే!

25 Mar, 2019 17:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో గత మే నెలలో కాంగ్రెస్‌–జనతాదళ్‌ (సెక్యులర్‌) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమై తమ ఉమ్మడి బలాన్ని చాటాయి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని ఇచ్చాయి. అప్పుడు బీజేపీ ప్రాభవం కాస్త తగ్గినట్లు కనిపించింది. ఆ తర్వాత హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పాలకపక్ష బీజేపీని పడగొట్టి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో బీజేపీ మరింత బలహీన పడింది.

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పాలకపక్ష బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం అవుతుందన్న ఆశలు చిగురించడమే కాకుండా ఆ దిశగా పురోగమన సూచనలు కూడా కనిపించాయి. తొమ్మిది నెలల అనంతరం సీను తిరగబడింది. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతోని సీట్ల ఒప్పందం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. బీజేపీనీ ఓడించడమే ఏకైక లక్ష్యమని ప్రకటించుకున్న కాంగ్రెస్‌ పార్టీ, సొంతంగా పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలా, మిత్రపక్షాల డిమాండ్‌కు తలొగ్గి వారడినన్ని సీట్లు ఇస్తూ ముందుకు పోవాలా ? అన్న సంశయంలో ఊగిసలాడింది. పార్టీని బలోపేతం చేసుకునేవైపే ఆలోచనలు మొగ్గుచూపాయి.

ఇది 1990లో ‘పాచిమడి’ కాంగ్రెస్‌ సమ్మేళనంలో చేసిన తీర్మానం గుర్తుకు తెచ్చింది. రాజకీయ సమీకరణలు, సంకీర్ణాలు తాత్కాలికమని, అత్యవసరమైనప్పుడు మినహా వాటి జోలికి వెళ్లకూడదని, పార్టీ సిద్ధాంతాన్ని తాకట్టుపెట్టో, పార్టీ బలహీనపడుతుందనకున్నప్పుడో సంకీర్ణాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని నాటి సమ్మేళనం తీర్మానించింది. ఏకపక్ష పార్టీ పాలన అంత ఈజీ కాదని 2003లో సిమ్లాలో జరిగిన పార్టీ సదస్సు నాటికి సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంకు అర్థం అయింది. ఒంటరిగా వెళ్లడం వల్ల లాభం లేదనుకున్న కాంగ్రెస్‌ నాడు భావసారూప్యతగల ఆర్జేడీ, లోక్‌జనశక్తి పార్టీ, ద్రావిడ మున్నేట్ర కళగం లాంటి పార్టీలను కలుపుకోవడం వల్ల 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అది పదేళ్లపాటు కొనసాగింది.

ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చలు జరిపినప్పుడల్లా ఒంటరిగా పోవాలా, మిత్రపక్షాలను కలుపుకుపోవాలా? అన్న సంశయం కాంగ్రెస్‌ ముందు నిలుస్తోంది. మిత్రపక్షాల ఒత్తిడి రాజకీయాలకు లొంగకపోవడం వల్ల బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కాంగ్రెస్‌కు పొత్తు కుదరలేదు. మిత్రపక్షాలతో రాహుల్‌ గాంధీ తానే స్వయంగా చర్చలు జరిపి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, తన నాయకత్వం బలపడి ఉండేదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇతరులకు ఆ బాధ్యతను అప్పగించడం వల్ల ఆ అవకాశాన్ని ఆయన కోల్పోయారని వారంటున్నారు. ఈసారి ప్రధాని పదవిపై ఆశ వదులుకొని 2024లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళితే రాహుల్‌ గాంధీ ఆశలు ఫలిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు