ఇప్పటికైనా గొంతెత్తి ప్రశ్నించండి...!

15 Jun, 2018 14:48 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

ముంబై :  అగ్ర కులస్థులకు చెందిన బావిలో ఈత కొట్టారనే కారణంగా మాతంగి(ఎస్టీ) వర్గానికి చెందిన యువకులను చితకబాది, నగ్నంగా ఊరేగించిన ఘటన మహారాష్ట్రలో జరిగిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. మానవత్వం చచ్చిపోయే పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీ విద్వేషపూరిత భావజాలం మరోసారి బయటపడిందని విమర్శించారు. ‘ఈ రోజు మానవత్వం మరణం అంచుల్లోకి వెళ్లింది. ఆరెస్సెస్‌, బీజేపీలు వ్యాప్తి చేస్తున్న విద్వేషపూరిత భావజాలానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు కూడా గొంతెత్తి ప్రశ్నించకపోతే భావితరాలు మనల్ని క్షమించవు’  అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా గత ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని జలగాన్‌ గ్రామంలో మంచినీటి బావిలో ఈత కొట్టారనే కారణంగా ఇద్దరు యువకులను తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి పోలీసులను ఆదేశించారు. ఇలాంటి అమానవీయ ఘటనలను తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించబోదని తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువకుల తల్లి.. లోతైన బావిలో ఈత కొట్టవద్దని చెప్పినా తన పిల్లలు వినలేదని, తప్పు చేసిన కారణంగానే వాళ్లు దెబ్బలు తిన్నారని ఫిర్యాదు వెనక్కి తీసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు