చిన్నారి ఆ‘నందన్‌’..

20 Apr, 2019 01:00 IST|Sakshi

ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావం సంగతి ఎలా ఉన్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చిన్నారుల ఆకాంక్షలు కూడా అత్యంత సులభంగా తీరిపోతున్నాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. రాహుల్‌ గాంధీ.. తను పోటీకి దిగిన కేరళలోని వయనాడ్‌లో గత మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం కేరళలోని కన్నూర్‌ జిల్లాకు వచ్చారు. కన్నూర్‌ జిల్లా ఆడిటోరియంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తొమ్మిది గంటలకు సభ మొదలు కావాల్సి ఉంది. అయితే ఒకసారి రాహుల్‌ గాంధీని చూడాలన్న కోరికతో ఏడేళ్ల నందన్‌ అనే బాలుడు తన తల్లిదండ్రులతో సహా ఉదయం ఐదు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నాడు. రాహుల్‌ను అభిమానించే నందన్‌కు దాదాపు ఐదు గంటలు ఎదురు చూసినా రాహుల్‌ దర్శనం దక్కలేదు. భద్రతా ఏర్పాట్ల రీత్యా అతడిని లోనికి అనుమతించకపోవడంతో నందన్‌ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని నందన్‌ తండ్రి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో విషయం రాహుల్‌ దృష్టికి చేరింది.

ఫోన్‌ చేసి పలకరించిన రాహుల్‌
ఇదిలా ఉండగా హఠాత్తుగా రాహుల్‌ గాంధీ తన వీరాభిమాని అయిన ఆ బాలుడు తల్లికి ఫోన్‌ చేసి ‘నేను రాహుల్‌ గాంధీని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయితో మాట్లాడొచ్చా’’ అని ప్రశ్నించడంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆ తల్లి తన కుమారుడి చేతికి ఫోన్‌ ఇచ్చి మురిసిపోయిందట. చొక్కా జేబుకు రాహుల్‌ ఫొటో పెట్టుకుని, జేబులో తనకి అత్యంత ఇష్టుడైన రాహుల్‌ గాంధీని కలవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతూ, ఎప్పటికైనా రాహుల్‌ గాంధీని కలుస్తానంటూ ఓ లేఖ రాసుకుని వచ్చిన బుడతడి గురించి నందన్‌ తండ్రి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ దివ్యస్పందన గురువారం ఈ కథనాన్ని పోస్ట్‌ చేసింది. దాంతో పాటు రాహుల్‌తో మాట్లాడాలన్న నందన్‌ కోరిక తీరనుందని కూడా వ్యాఖ్యానించింది. ట్విట్టర్‌ వ్యాఖ్యలకు అనుగుణంగానే రాహుల్‌ నందన్‌తో మాట్లాడటం
అందరినీ ఆనందంలో ముంచెత్తింది.  

మరిన్ని వార్తలు