బిగ్‌బాస్‌ మీపై కన్నేశారు..

26 Mar, 2018 14:17 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌, కాంగ్రెస్‌ యాప్‌లు సమాచార భద్రత విషయంలో లోపభూయిష్టంగా ఉన్నాయని ఫ్రెంచ్‌ హ్యాకర్‌ చేసిన ఆరోపణలు ఇరు పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని బిగ్‌బాస్‌గా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. భారతీయులపై మోదీ నిఘా పెట్టారని ఆరోపించారు. మరోవైపు పాలక పార్టీ కాంగ్రెస్‌ను సమాచారం చోరీకి పాల్పడుతోందని దుయ్యబట్టింది.

‘మోదీ నమో యాప్‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆడియో, వీడియో, కాంటాక్టులను రహస్యంగా రికార్డు చేస్తుంది, చివరకు మీ ప్రదేశాన్ని సైతం జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తుంది...భారతీయులపై నిఘా పెట్టడం ఆయనకు ఇష్ట’మని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. నమో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని 13 లక్షల ఎన్‌సీసీ కేడెట్లను ఒత్తిడి చేస్తున్నారని డిలీట్‌నమోయాప్‌ హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, రాహుల్‌ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. సింగపూర్‌లోని రాహుల్‌ స్నేహితులకు కాంగ్రెస్‌ యాప్‌ యూజర్ల డేటాను షేర్‌ చేస్తున్నారని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు.

మరిన్ని వార్తలు