కేంద్రం మౌనం వీడాలి : రాహుల్‌

29 May, 2020 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత​-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు అనేక ఊహాగానాలకు తావిస్తుందని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో రాహుల్‌.. ఓ పోస్ట్‌ చేశారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సరిహద్దు పరిస్థితులపై కేంద్రం మౌనం వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. (చదవండి : హద్దు మీరుతున్న డ్రాగన్‌)

ఇదివరకే ఈ పరిస్థితులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. చైనాతో మిలటరీ స్థాయిలో, దౌత్య మార్గాల్లో వివాద పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పింది. శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అని పేర్కొంది. కాగా, ప్రపంచ దేశాలు కరోనాపై పోరు చేస్తుంటే.. చైనా మాత్రం భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను పెంచి భారత్‌లో హెచ్చరికలు పంపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు హాంకాంగ్‌ విషయంలో చైనా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. వాటి నుంచి దృష్టి మరల్చడానికే సరిహద్దు వివాదాలతో సరికొత్త డ్రామా ఆడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.(చదవండి : ‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’)

మరిన్ని వార్తలు