మీ ఆశలు అడియాసలే

15 Aug, 2018 03:04 IST|Sakshi
విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. చిత్రంలో పార్టీ నేతలు రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, పొన్నాల, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కార్తీక రెడ్డి, ఆర్‌.సి.కుంతియా, షబ్బీర్‌ అలీ, వీహెచ్, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, లలిత, దామోదర్‌ రెడ్డి, చిన్నారెడ్డి, దాసోజు శ్రావణ్, సుధీర్‌ రెడ్డి, గీతారెడ్డి తదితరులు

     తెలంగాణ ఆకాంక్షలేవీ నెరవేరలేదు: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 

     ముఖ్యమంత్రి కుటుంబమే లబ్ధి పొందుతోంది  

     ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు 

     ఫీజుల పథకాన్ని పేదలకు దూరం చేస్తున్నారు 

     విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభలో ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం మీరంతా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడారు. రాష్ట్రం ఏర్పాటయితే మీ బతుకులు బాగుపడుతాయని, మీ నీళ్లు మీకే వస్తాయని, మీ యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశించారు. ఎన్నో కలలు కన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ కలలు సాకారం కాలేదు. కనీసం మీ ఆకాంక్షల స్వప్నాన్ని సాకారం చేసే ప్రయత్నం కూడా మొదలుకాలేదు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబమే లబ్ధి పొందుతోంది. ఆ కుటుంబమే మీ శ్రమ అంతటినీ దోపిడీ చేస్తోంది..’’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై వాగ్బాణాలు సంధించారు. త్యాగాలు, బలిదానాలు చేసిన యువతకు ముఖ్యమంత్రి ఎన్నో హామీలిచ్చి విస్మరించారని ఆరోపించారు.

అమరవీరుల కుటుంబాలను మోసం చేశారని దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఓట్లేయించుకుని నాలుగేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావడం లేదని, వచ్చినా నోటిఫికేషన్లలో ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ‘విద్యార్థి, నిరుద్యోగ గర్జన’సభకు రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. గత నాలుగేళ్లలో రాష్ట్రం లో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి దూరం చేస్తున్నారని, హైదరాబాద్‌లో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూలు ఫీజులున్నాయని అన్నారు. నాలుగేళ్లలో 400 శాతం ఫీజులు పెరిగాయని వివరించారు. 

గారడీలు చేసి.. అంచనాలు పెంచి.. 
కేసీఆర్‌ను రాహుల్‌ ఓ రీడిజైనింగ్‌ స్పెషలిస్ట్‌గా అభివర్ణించారు. ‘‘పేద రైతుల నుంచి దుర్మార్గంగా భూములు లాక్కుంటున్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు రీడిజైన్‌ అంటూ ఆయన పేరు తీసేశారు. రూ.38 వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు అంచనాలను గారడీ మాటలు చెప్పి రూ.లక్ష కోట్లకు పెంచారు. ప్రాజెక్టు టెండర్లలోనూ పారదర్శకత పాటించలేదు. ఇందులో వచ్చిన అవినీతి కమీషన్‌ డబ్బులన్నింటినీ ఒక కుటుంబం జేబులోకే వెళ్లాయి. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ దుమ్మగూడెం ప్రాజెక్టులను మేం రూ.2,500 కోట్లతో రూపకల్పన చేస్తే సీతారామా పేరుతో రీడిజైన్‌ అంటూ మాయమాటలు చెప్పి ప్రాజెక్టు అంచనాలను రూ.12 వేల కోట్లకు చేర్చారు.

తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షల కల నెరవేరడం లేదు. నాలుగేళ్లయినా కనీసం ఆ ప్రయత్నాలైనా ప్రారంభం మొదలు కాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటాం. రైతులకు ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య, వైద్య సేవలందేలా కృషి చేస్తాం’’అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆశించిన కలలు నెరవేరాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, కాంగ్రెస్‌లోకి వచ్చి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్‌ పేరెత్తకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ సంబోధించడం గమనార్హం.

మోదీ నా ముందు నిలబడలేరు
రాఫెల్‌ విమానాల కొనుగోలు కుంభకోణంపై తాను ప్రధాని మోదీతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఆ చర్చలో మోదీ తన ముందు నిలబడలేరని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రీడిజైన్‌ అంటేనే అవి నీతి కాబట్టి పార్లమెంటులో తాను మాట్లాడిన మాటలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఈ విషయాన్ని తాను అర్థం చేసుకుంటానని, కానీ దేశవ్యాప్తంగా మహిళలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై జ రుగుతున్న అత్యాచారాలపై అయినా మోదీ మాట్లాడి ఉండాల్సిందన్నారు. ఈ దేశంలోని మహిళలను బీజేపీ ఎమ్మెల్యేల నుంచి కాపాడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, రేవంత్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్, సంపత్‌కుమార్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి, దామోదర్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డిలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. రాహుల్‌ ప్రసంగాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్‌ అనువదించిన తీరు సభికులను బాగా ఆకట్టుకుంది.

ఇద్దరూ రీడిజైనర్లే.. 
దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఇద్దరూ రీడిజైనర్లేనని రాహుల్‌ వ్యాఖ్యానించారు. పైనో రీడిజైనర్‌ ఉన్నారని, ఆయన ఏం చేస్తే కింద ఉన్న రీడిజైనర్‌ సమర్థిస్తారని పేర్కొన్నారు. ‘‘నోట్ల రద్దు అన్నా సమర్థిస్తారు. జీఎస్టీ అంటే చప్పట్లు కొడతారు. కేంద్రంలో రీడిజైనర్‌ మోదీ రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టును రీడిజైన్‌ చేస్తే.. కింద ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా చేయనివ్వరు. ఇక్కడ ఏకంగా ధర్నా చౌక్‌నే ఎత్తేశారు’’అని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు