మోదీ పాటకు రాహుల్‌ కౌంటర్‌..!

16 Mar, 2019 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. దాంతోపాటే విమర్శలు, ప్రతివిమర్శల పరంపరా షురూ అయింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘నేను దేశానికి, మీ అందరికీ కాపలాదారు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ‘చోకీదార్‌ చోర్‌ హై’ అంటూ కాంగ్రెస్‌​ పార్టీ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో ఆయన పంథా మార్చారు. ‘మై భీ చోకీదార్‌ హై’  అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘నేను కూడా కాపలాదారునే’ అనే కొత్త హాష్‌టాగ్‌తో ట్విటర్‌ వేదికగా ప్రచారం పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అవినీతి, అనాగరిక, సామాజిక దురాచారాలపై పోరాడే దేశ ప్రజలందరూ కాపలాదారులే అంటున్నారు. మైభీ చోకీదార్‌ అంటూ ప్రజలందరూ గళం విప్పుతున్న వీడియో సాంగ్‌ను మోదీ శనివారం విడుదల చేశారు. 

అయితే, బీజేపీ తాజా ప్రచారాన్ని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. ‘ఇండియా బేవకూఫ్‌ నహీహే’ అనే హాష్‌టాగ్‌తో పాటు ‘సూట్‌బూట్‌ చోకీదార్‌’ అంటూ రాహుల్‌ ప్రధానికి కౌంటర్‌ ఇచ్చారు. అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదాని వంటి బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ కాపలాదారుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ మరో అడుగు ముందుకేసి అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా మరికొంతమంది ఫొటోలతో పాటు మోదీ ఫొటోను జతచేసి ట్వీట్‌ చేశారు. ‘మోదీ ఆత్మరక్షణలో పడ్డారు’.. ‘ఆయన తప్పుచేసిన భావనలో ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. కాగా, రఫేల్‌ కుంభకోణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని కాపలాదారుడే దొంగలా మారిపోయారని కాంగ్రెస్‌ విమర్శలనెక్కుపెట్టిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు