రాహుల్‌వి పగటి కలలే!

10 May, 2018 01:36 IST|Sakshi
చిక్‌మగ్లూర్‌ సభలో ప్రధాని మోదీ

పరిణతి లేని వ్యక్తిని ప్రధానిగా దేశం అంగీకరిస్తుందా?

పీఎం పదవి ఆ ఒక్క కుటుంబానిదే అనుకుంటున్నారు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిప్పులు

సాక్షి, బళ్లారి/కోలారు: తదుపరి లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రధాని పదవి చేపడతానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పగటి కలలు కంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అసలు అలాంటి పరిణతి లేని వ్యక్తిని దేశం ప్రధానిగా అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవి తమకే రిజర్వు అయిందని గాంధీ కుటుంబం భావిస్తోందని పేర్కొన్నారు.

నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా రాహుల్‌ గర్వం ఏమాత్రం తగ్గలేదని చురకలంటించారు. గత యూపీఏ హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ సోనియా చేతిలో ఉంటే, తమ ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలే హై కమాండ్‌ అని అన్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే వంతు ఇప్పుడు కర్ణాటకకు వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బుధవారం బంగారుపేట, చిక్‌మగ్లూర్‌లో జరిగిన ర్యాలీల్లో ప్రసంగించారు.

ధ్యాసంతా ప్రధాని పీఠం పైనే...
‘ప్రధాని పదవి తమ కుటుంబానికే రిజర్వు అయిందని ఆయన (రాహుల్‌) భావిస్తున్నారు. మరెవరూ ఆ కుర్చీపై కూర్చోవద్దని కోరుకుంటున్నారు. అది వారసత్వ హక్కు అని అనుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేల్కొని ఉన్నా, నిద్రిస్తున్నా ప్రధాని కుర్చీ గురించే కలలు కంటున్నారు. భాగస్వామ్య పక్షాలపై నమ్మకం లేని, గర్వం తలకెక్కిన వ్యక్తి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతానని ప్రకటించారు. దేశం అలాంటి అపరిపక్వ వ్యక్తిని ప్రధానిగా ఆమోదిస్తుందా? కొందరు నాయకులు 40 ఏళ్లుగా ప్రధాని పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

వారందరినీ కాదని హఠాత్తుగా ఒకాయన వచ్చి ప్రధాని అవుతానని అంటున్నారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. ఆ ప్రకటన రాహుల్‌ పొగరు, కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్య పరిస్థితిని సూచించడం లేదా? అని ర్యాలీకి తరలివచ్చిన ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి కొత్త నాయకత్వం తీసుకొస్తాడని రాహుల్‌ను 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తే ఈ 11 ఏళ్లలో సాధించిందేమీ లేదని దెప్పిపొడిచారు. నాలుగేళ్లలో సుమారు 25–30 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపాలైనా ఆయన అహంభావం తగ్గలేదని అన్నారు.

రాజ్యాంగమంటే లెక్కే లేదు..
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పందిస్తూ..‘నన్ను అధికారం నుంచి తప్పించడానికి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు సమావేశమవుతున్నారు. వాళ్లందరనీ కాదని ప్రధాని అవుతానని రాహుల్‌ ప్రకటించడం ప్రతిపాదిత కూటమిలోని పార్టీల మధ్య విశ్వాసలేమిని తేటతెల్లం చేస్తోంది. గాంధీ కుటుంబానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే లెక్కే లేదు. అందుకే వాటిని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆరోపించారు.


 

మరిన్ని వార్తలు